‘పంచాయ‌తీ’ పై ‘సుప్రీం’కు ప్ర‌భుత్వం..!!

పంచాయతీ ఎన్నిక‌ల విష‌యంలో భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ‌పై స‌చివాల‌యంలో మంత్రి జూప‌ల్లి అధ్య‌క్ష‌త‌న మంత్రుల స‌బ్ క‌మిటీ స‌మావేశమైంది. ఈ స‌మావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటిఆర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నతో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్.కె. జోషి, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు, న్యాయ కార్యదర్శి నిరంజన్ రావు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని హై కోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై చర్చించారు.

బీసీలకు పంచాయతి ఎన్నికల్లో గ‌తంలో ఇచ్చిన విధంగానే 34శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలుగా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ఈ భేటీలో నిర్ణ‌యించుకున్నారు. బీసీ గణన, నెలాఖరుతో పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తుండ‌టంతో ఎలా ముందుకు వెళ్ళాలన్న దానిపై క్యాబినెట్ లో చర్చించాలని సబ్ కమిటీ తీర్మానించింది. ఇప్పటికే పంచాయితీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రభుత్వం సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికీ.. కొంత‌మంది కేసులు వేయ‌డం వ‌ల్ల చిక్కులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని మంద్రి ఈటెల అన్నారు.

ఎట్టి పరస్థితుల్లోనూ ప్రస్తుతం బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లు తగ్గకుండా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామ‌ని ఈటెల తెలిపారు. జూలై 31 తో సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తుండటంతో తర్వాత స్పెషల్ ఆఫీసర్ పరిపాలన విధించాలా.. లేక సర్పంచ్ పదవీకాలం పొడిగించాలా అన్నదానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని మంత్రి చెప్పారు. రిజర్వేషన్ అంశంపై రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామ‌ని, దీనిపై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామ‌ని మంత్రి జూప‌ల్లి చెప్పారు.