ఆయన్ను రానివ్వద్దని నేను అనలేదు..!!
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ టీఆర్ఎస్ పై మండిపడ్డారు. బాలాపూర్ లో దేవతల గుట్టల్లో వందల ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా అవుతుంటే కేసీఆర్ కు కనబడటం లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. కబ్జా దారుల వెనక ఎవరు ఉన్నారో సర్కార్ బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కబ్జాల పై కఠిన చర్యలు అంటున్న కేటీఆర్ కు దేవతల గుట్ట లో జరుగుతున్న కబ్జా కనపడదా అని ప్రశ్నించారు. న్యాయ స్థానాలు లేకపోతే ప్రభుత్వ పెద్దలు చార్మినార్ ను కూడా అమ్మేసేవారన్నారాయన.
కోర్టు లు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి సిగ్గురావడం లేదని విమర్శించారు వీహెచ్. టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ పై తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న వార్తలపై సమాధానమిచ్చారు. డీఎస్ ను పార్టీలోకి రానివ్వద్దని తాను అనలేదని ఆయన చెప్పారు. డీఎస్ ను చేర్చుకోవాలా వద్దా అన్నది పీసీసీ సంప్రదింపుల కమిటీ నిర్ణయిస్తుందని మాత్రమే తాను అన్నానని, పార్టీకీ లాభం జరుగుతుందనుకుంటే డీఎస్ నే కాదు ఎవరినైనా చేర్చుకుంటామని చెప్పుకొచ్చారు వీహెచ్.