ఎన్నికలకు సిద్ధంకండి…! కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన ఉత్తమ్..!!
అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే వచ్చే సూచన ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తన శ్రేణులను సమాయత్తం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఎన్నికలకు సిద్ధంకండని పిలుపునివ్వడంతో విపక్ష కాంగ్రెస్ కూడా స్పీడ్ పెంచింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా కాంగ్రెస్ శ్రేణులుశాసన సభ ఎన్నికలకు సిద్ధం అవ్వండంటూ ఫేస్ బుక్ వేదికగా పిలుపునిచ్చారు.
అసెంబ్లీకి ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, పార్టీ నాయకులు..కార్యకర్తలు శక్తి ప్రాజెక్టు లో చేరాలని ఉత్తమ్ చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం అనేక తప్పిదాలు చేస్తోందని, రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం తన తప్పిదాలు కప్పిపుచుకునేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కోర్ట్ లో కేసులకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఎన్నికలు దగ్గర పడ్డాయని కేసీఆర్, మోడీ రైతుల గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమాగా చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శులు రంగంలోకి దిగారు. ఈ నెల 15,16,17 న ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శులు సలీమ్, బోస్ రాజు, శ్రీనివాస్ కృష్ణన్.. నల్గొండ, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో పర్యటనలు చేయనున్నారు.