టవర్ ఎక్కిన లవర్…!!
ప్రేమించిన యువకుడు పెళ్లిచేసుకుంటానని చెప్పి ఇప్పుడు ముఖం చాటేయడంతో సెల్ టవర్ ఎక్కింది ఓ యువతి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో రావుల భాస్కర్ తను ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినా ఇప్పుడు ముఖం చాటేశాడని యువతి ఆరోపిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ మూడు రోజుల క్రితం యువకుడి ఇంటి ముందు ధర్నాకు కూడా దిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పే వరకు కదిలేది లేదంది.
పోలీసులు యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినప్పటికీ , యువకుడిని ఎందుకు తీసుకురావడంలేదంటూ పోలీసులను ప్రశ్నించింది. తనకు న్యాయం కావాలంటూ సెల్ టవర్ ఎక్కింది ఆ యువతి. తన ప్రియుడితో తనకు పెళ్లి చేయాల్సిందేనని, లేకుంటే చచ్చిపోతానంటూ తేల్చి చెప్పింది. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతికి సర్థి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యువతికి మద్దతుగా స్థానిక మహిళా, ప్రజా సంఘాలు రాస్తారోకో నిర్వహిస్తున్నాయి. యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి..