రాహుల్’ని కలిసిన రజనీ దర్శకుడు.. ఏంటీ మేటరు ?
సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం హాట్ టాపిక్ గా మారింది. రజనీతో వరుసగా కబాలి, కాలా సినిమాలు చేశాడు దర్శకుడు పా. రంజిత్. ఐతే, ఈ రెండు సినిమాలు రజనీ అభిమానులని పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి. ‘కాలా’ తర్వాత రంజిత్ పా సూర్య హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నాడు. ఐతే, ఇంతలో ఈ దర్శకుడు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలోని దళిత ఓటు బ్యాంకుపై రాహుల్‌గాంధీ దృష్టి పెట్టారు. ఈ విషయంపై చర్చించడానికే పా.రంజిత్‌ను రాహుల్ పిలిపించుకున్నారని తెలిసింది. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన జిగ్నేష్ మేవానితో పా.రంజిత్ కు మంచి అనుబంధం ఏర్పడింది. దళిత ఓటు బ్యాంకు గురించి రాహుల్‌గాంధీ ఆలోచిస్తుండగా.. పా.రంజిత్ గురించి మేవాని వివరించినట్టు, దీంతో అతనిని దిల్లీకి రప్పించాలని రాహుల్ సూచించినట్టు తెలుస్తోంది.
ఇదీగాక, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, రజనీకాంత్ పార్టీలు కూటమి ఏర్పాటు చేయవచ్చు. అందుకు మంతనాలు సైతం జరుగుతున్నాయనే ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా రజనీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్న పా రంజిత్ రాహుల్ గాంధీని కలిశారని చెప్పుకొన్నారు. ఇందులో వాస్తవం లేదని.. దఌత ఓటు బ్యాంకుపై చర్చించడానికే.. రంజిత్ రాహుల్ ని కలిసినట్టు తెలిసింది.