లార్ట్స్’లో ప్రేమ గెలిచింది

లార్డ్స్‌ వన్డేలో భారత్‌ ఓడినా.. ప్రేమ గెలిచింది. అదేలా అంటే.. ప్రేక్షక గ్యాలరీలో ఓ యువకుడు లైవ్ లో లవ్ ప్రపోజల్ చేశాడు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ 24వ ఓవర్ చాహల్‌ వేస్తున్నాడు. రెండో బంతి నోబాల్‌ కావడంతో అంపైర్‌ ఫ్రీహిట్‌ ప్రకటించాడు. ఐతే, ఆ సమయంలో లైవ్‌ ప్రసారం చేస్తున్న ఓ కెమెరా ఒక్కసారిగా మైదానంలోని ప్రేక్షక గ్యాలరీ వైపు మళ్లింది. అప్పటి వరకూ ప్రశాంతంగా మ్యాచ్‌ చూస్తున్న ఓ యువకుడు వెంటనే మోకాళ్లపై నిల్చొని జేబులో నుంచి ఉంగరాన్ని తీసి తన ప్రియురాలికి అభిమానుల సమక్షంలో ప్రేమ ప్రపోజ్‌ చేశాడు. ఈ క్రమంలో ఆశ్చర్యానికి గురైన ఆ అమ్మయి కాసేపటి తర్వాత అతని ప్రేమను అంగీకరించింది.

ఈ లవ్ ప్రపోజల్ ని స్కై స్పోర్ట్స్‌ ఛానల్‌ లైవ్ ఇచ్చింది. ఆ సమయంలో టీవీ తెరపై డెసిషన్‌ పెండింగ్‌ (decision pending) అంటూ ప్రదర్శించింది. కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ ల్యాయిడ్‌ లైవ్‌లో దీనిని చూస్తూ.. ఆ అమ్మాయి అతని ప్రేమను అంగీకరించిందంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది. ఈ లవ్ ప్రపోజల్ పై అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఇక, రెండో వన్డేలో భారత్ 86పరుగుల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌ మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.