ఆర్.ఎక్స్100 శాటిలైట్.. అదే మైలేజ్ !

థియేటర్స్ లో ‘ఆర్.ఎక్స్100’ బంపర్ మైలేజీ ఇస్తోంది. తొలి మూడు రోజుల్లో రూ. 3.76 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడీ సినిమా శాటిలైట్ రైట్స్ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ బండిని సొంతం చేసుకొనేందుకు టీవీ ఛానెల్స్ పోటీపడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాత శాటిలైట్ రేటు రూ. 6కోట్లు చెబుతున్నాడట. ఓ 50 ఇటు, అటుగా తెగిపోనుందని చెబుతున్నారు. కేవలం రూ. 2.70కోట్లకు అమ్ముడుపోయినా ఈ సినిమా రూ. 20కోట్ల వరకు తెచ్చిపెట్టేలా కనబడుతోంది. ఈ లెక్కన ఈ బండి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు.

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ-పాయల్ రాజ్ పుత్ జంటగా ‘ఆర్.ఎక్స్100’ తెరకెక్కింది. కొత్తదనం, పాజిటివ్ టాక్ తో విడుదలైన ఈ సినిమా తొలిరోజే రూ. 1.41 కోట్లు షేర్ ని రాబట్టింది. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లోనూ అదే మైలేజ్ ఇచ్చింది. ఇప్పుడు శాటిలైట్ రేటులో నూ జోరు చూపిస్తోంది. ఈ యేడాది ఓ చిన్న సినిమా సాధించిన పెద్ద విజయంగా ఆర్ ఎక్స్ 100 నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.