కేంద్రంపై సుప్రీం సీరియస్..!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ దర్శక, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మాదక ద్రవ్యాలను అరికట్టడానికి విధివిధానాలు రూపొందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విధివిధానాలు రూపొందించడానికి నాలుగు నెలల సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
ఇప్పటి వరకు విధివిధానాలు ఎందుకు రూపొందించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆగష్టు 31లోపు విధివిధానాలు రూపొందించాలని ధర్మాసనం సూచించింది. కనీసం రెండు నెలల గడువైనా ఇవ్వాలని కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటరల్ జనరల్ మణీందర్ సింగ్ కోర్టును కోరారు. విధివిధానాలు రూపొందించడంలో అఖిలభారత వైద్య విజ్నాన సంస్థ(ఎయిమ్స్)సహకారం ఆలస్యం అవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపారు మణీందర్ సింగ్. అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీచేయాలని పిటీషనర్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోరగా, విధివిధానాలు రూపొందించిన తరువాత, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసే విషయం గురించి ఆలోచిద్దామని సుప్రీం స్పష్టం చేసింది.
తదుపరి విచారణ సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.