రసాభాసగా కాంగ్రెస్ పార్లమెంటరీ స్థాయి సమీక్షలు..!!
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో తరచూ గ్రూపు తగాదాలు జరుగుతుంటాయి. అది సహజమే అంటారు తెలిసినవారంతా. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అంతర్గత విభేధాలు అధిష్టాన ధూతల ముందే బయటపెట్టుకుంటున్నారు ఆ పార్టీ నేతలంతా. ఇప్పటికే ఎన్నికల కసరత్తులో భాగంగా పార్లమెంటరీ స్థాయి సమీక్షలను నిర్వహించుకునేందుకు షెడ్యూలు ఖరారు చేసుకున్న టీకాంగ్రెస్ కు సమావేశాల్లో బాహాబాహీలు తప్పడంలేదు. సికింద్రాబాద్, భువనగిరి పార్లమెంటరీ స్థాయి సమీక్షా సమావేశంలో అంతర్గత విభేదాలు ఏఐసీసీ కార్యదర్శుల సాక్షిగా బయటపడ్డాయి. టికెట్ల కోసం ఎవరి వాదనలు వారు వినిపించారు.
హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం విషయంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పీసీసీ వైఖరిపై సీరియస్ అయ్యారు. బీజేపీ కంచుకోటగా ఉన్న సికింద్రాబాద్ స్థానాన్ని ఎంతో కష్టపడి కాంగ్రెస్ ను గెలిపించాలనని, ఇప్పుడు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు సికింద్రాబాద్ స్థానం ఇవ్వనున్నట్లు వస్తున్న లీకుల వెనక ఉద్దేశమేమిటని గట్టిగా ప్రశ్నించారు అంజన్. పార్టీ కోసం పనిచేస్తున్న వారి కోసం కాకుండా ఇతరులకు సీట్లు ఇవ్వకూడదని సూచించారు.
మరోవైపు భువనగిరి పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్ సమావేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలు, నేతలతో ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ సమావేశమయ్యారు. ఒక్కో నియోజకవర్గం నేతలతో విడివిడిగా మాట్లాడారు. అయితే మునుగోడు, నకిరేకల్ , భువనగిరి స్థానాలకు సంబంధించి ఆశావహుల వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఓ స్థాయికి వెళ్ళింది. కొంత తోపులాట కూడా ఒకరికొకరు నినాదాలు చేయడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఇలా క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న పార్లమెంటరీస్థాయి సమావేశాలు రసాభాసగా మారాయి.