బీజేపీ ప్ర‌భుత్వం భారీ కుంభకోణం…!?

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని కార్యాలయంపై సంచలన ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపణలు చేశారు. ఎస్ఆర్ ఆయిల్ ఒప్పందంలో రష్యా కంపెనీతో కలసి బీజేపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఆయ‌న ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ – ప్రధాని మోదీల సమక్షంలో 2016 డిసెంబర్లో ఎస్ఆర్ ఆయిల్ ఒప్పందం జరిగిందన్నారు.ప్రధాని మోదీకి సమక్షంలోనే ఎస్ఆర్ ఆయిల్ కుంభకోణం జరిగిందని ఆయ‌న ఆరోపించారు. ఎస్ఆర్ ఆయిల్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని, ఈ వ్యవహారంలో పెట్టుబడుదారులు భారీగా నష్టపోయారని చెప్పారాయ‌న‌.

దేశానికి రావాల్సిన టాక్స్ ఒక్క రూపాయి కూడా రాలేదని, ప్రధాని సమక్షంలో జరిగిన ఒప్పందానికి ఆయనదే బాధ్యత వహించాలని ఆయ‌న అన్నారు. రష్యా ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం జరిగితే.. ప్రభుత్వానికి ప్రభుత్వానికిమధ్య డీల్ జరిగినట్లు చూపించారని ఆయ‌న తెలిపారు. ప్రధాని పదే పదే విదేశాలు తిరగటం‌ కూడా ఎస్ఆర్ ఆయిల్ కుంభకోణం డబ్బు కోసమేన‌ని, ఎస్సార్ ఆయిల్ వ్యవహారంలో అధ్యక్షుడు పుతిన్ ఒక రష్యన్ మంత్రిని అరెస్ట్ చేయించార‌ని ఆయ‌న చెప్పారు.ఈ ఒప్పందం జరిగిన సమయంలోనే ప్రధాని మోదీ అనధికారంగా చైనాలో పర్యటించారని, అంతర్జాతీయ విషయం కాబట్టి సమాచారం సేకరించటానినే సమయం పట్టింద‌ని తెలిపారు కుటుంబ‌రావు.

బీజేపీతో సంబంధాలు తెగిపోయాయి కాబట్టే ఇప్పుడు కుంభకోణం గురించి మాట్లాడుతున్నాననటం సరైంది కాదని, ఎస్ఆర్ ఆయిల్ కుంభకోణం వ్యవహారాన్ని పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామ‌ని చెప్పారాయ‌న‌. దేశంలోని‌ అన్ని పార్టీల ఎంపీలకు ఈ కుంభకోణం గురించి తెలియజేస్తామ‌న్నారు. ఎస్ఆర్ ఆయిల్ కుంభకోణాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళతాన‌ని ఆయ‌న అన్నారు.