వీలైతే ఇలా.. లేక‌పోతే అలా చేయ‌మ‌ని కోరండి..!!

టిడిపి ఎంపిలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. లోక్ సభ,రాజ్యసభ సభ్యులు,పార్టీ బాధ్యులు ఈ టెలి కాన్ఫ‌రెన్స్ లో పాల్గొన్నారు. శుక్ర‌వారం అవిశ్వాసం నేప‌థ్యంలో ఈరోజు ఏం చేయాల‌నే అంశంపై సీఎం చంద్ర‌బాబు ఎంపీల‌కు సూచించారు. అన్నిపార్టీల నేతలను,ఎంపిలను కలవాల‌ని, అందరి మద్దతు కూడగట్టాలని చెప్పారు. ఏపీ సంఘీభావం ఇవ్వాల‌ని కోరాల‌ని చెప్పారు.

ఇదొక చారిత్రక అవకాశ‌మ‌ని, స్ఫూర్తిదాయక సమయ‌మ‌ని, ఆరోజు బిల్లు ఆమోదం ఎలా జరిగిందో గుర్తుచేయాల‌ని, నాలుగేళ్లలో జరిగిన అన్యాయాన్ని వివరించాల‌న్నారు సీఎం. ఎవరిలోనూ టీడీపీపై వ్యతిరేకత ఉండకుండా చూడాల‌ని, వీలైతే మ‌ద్ద‌తు లేక‌పోతే తటస్థంగా ఉండాలని కోరాల‌ని సూచించారు. తాను కూడా వివిధ పార్టీల నేతలతో మాట్లాడతానని చెప్పారు .అవిశ్వాసంపై చర్చ 7గంటలు జరిగే అవకాశం ఉంద‌న్నారు.

టీడీపికి 15నిముషాల‌కు పైగా అవకాశం ఇస్తార‌ని చెప్పారు. కానీ మరింత ఎక్కువ సమయం కావాలని అడగాల‌ని ఎంపీల‌కు చెప్పారు సీఎం. చర్చలో పాల్గొనే ఎంపిలు పూర్తిగా సంసిద్ధం కావాల‌ని, చట్టంలోని అంశాల అమలును అధ్యయనం చేయాల‌న్నారు. అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలును చర్చించాల‌ని చెప్పారు. ఎంపీలంతా రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ల‌క్ష్యంగా సంఘ‌టితంగా పోరాడాల‌న్నారు. ఇదొక చారిత్ర‌క అవ‌కాశ‌మ‌ని సీఎం అన్నారు.