కేటీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ స‌భ‌…! రాహుల్’నూ పిలుస్తామంటున్న ఉత్త‌మ్..!!

నేరెళ్ల ఘ‌ట‌న జ‌రిగి ఏడాది గ‌డుస్తున్న సంద‌ర్భంగా ప్ర‌భుత్వ వైఖ‌రిపై కాంగ్రెస్ పోరాట‌బాట ప‌డుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న ఈ స‌మ‌యంలో ద‌ళిత గిరిజ‌నుల‌పై టీఆర్ఎస్ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. నెరేళ్ల ఘటన , ఖమ్మం రైతులకు బేడీలు వేసిన ఘటనల పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేంద‌కు రెడీ అవుతోంది. దళిత గిరిజన ఆత్మ గౌరవ సభ ను ఈ నెలాఖరులో పెద్ద ఎత్తున సిరిసిల్లలో సభ నిర్వహించబోతున్న‌ట్లు టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ వెల్ల‌డించారు. ఈ సభకు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

ఈ నెలాఖరులో లేదంటే…ఆగస్ట్ మొదటివారంలో గాని సభ నిర్వహిస్తామ‌ని ఉత్త‌మ్ చెప్పారు . నెరేళ్లలో బీసీలను, దళితులను బట్టలిప్పించి వాళ్ళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, అది సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన అని ఆయ‌న అన్నారు. ఇసుక మాఫియాతో వేల కోట్ల దోపిడీ చేస్తూ రాబందుల్లా కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గ‌త ఏడాది జూలై లో సంఘటన జరిగినా, ఈ జూలై కి కూడా ఏమార్పు లేదని ఆయ‌న అన్నారు.

మంత్రి కేటీఆర్ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటివరకు ఈ ఘటన పై ఛార్జ్ షీట్ వేయలేదు, కేస్ డ్రాప్ చేయలేదన్నారాయ‌న‌. సంఘటన స్థలానికి మాజీ స్పీకర్ మీరా కుమార్ వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన అండగా నిలుస్తుందని ఆయ‌న చెప్పారు.