టీఆర్ఎస్ ఎంపీలది శిఖండి పాత్ర..!!
టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు బీజేపీ తరపున పార్లమెంట్ లో శిఖండి పాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. విభజన హామీల పై నాలుగేళ్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. విభజన హామీల పై టిఆర్ఎస్ అఖిలపక్షాన్ని పిలవదు..కేంద్రాన్ని అడగదు అని ఆయన ఎద్దేవా చేశారు. సీబీఐ కేసు ఉందని కేసీఆర్ భయపడుతున్నారని ఆయన అన్నారు.
మోడీతో సీఎం కెసిఆర్ ఏం లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారో చెప్పాలన్నారు పొన్నం. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా ఢిల్లీలో కాంగ్రెస్ మాజీ ఎంపీలంతా మిగతా పార్టీల మద్దతు కూడగట్టుకుని పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతామని అన్నారాయన. నిరసన తేదీని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. టి.ఆర్.ఎస్ 14మంది ఎంపీలు చేతకాని వాళ్ళలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకపక్క ఏపీ వాళ్ళు ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతుంటే మరోపక్క టిఆర్.ఎస్ ఎంపీలు మౌనంగా ఉంటున్నారని ఆయన అన్నారు.