బాబు గోగినేనికి నోటీసులు

ప్రముఖ హేతువాది బాబు గోగినేనిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఆయనకి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ‘బిగ్‌ బాస్‌’ షో నిర్వహకులకు మాదాపూర్‌ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. గత నెలలో దేశ ద్రోహం, మతాలు, కులాలు, వర్గాల పేరిట ప్రజల్లో విద్వేష భావనను రేకెత్తించడం నేరపూరితమైన నమ్మక ద్రోహం, మోసం, దురుద్దేశంతో శాంతిని భగ్నపరచడం, వర్గాల నడుమ శత్రు భావనను పెంపొందించడం, మత విశ్వాసాలను అవమానించడం, అనుచిత ప్రచారంతో పాటు ఆధార్‌ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ఈనెల 25వ తేదీలోగా బాబు గోగినేని కేసు పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని సైబరాబాద్ పోలీసులను ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే బాబు గోగినేనికి ఒకట్రెండు రోజుల్లో కోర్టు నోటీసులు అందజేయనున్నారు. నోటీసులు అందుకున్నాక వివరణ ఇచ్చుకునేందుకు 48 గంటలు సమయం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బాబు గోగినేని తెలుగు బిగ్ బాస్ 2 లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ షో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతోంది. దీంతో కోర్టు నోటీసులని బిగ్ బాస్ యాజమాన్యానికి అందించేందుకు మాదాపూర్ పోలీసులు రెడీ అయినట్టు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 1 సమయంలో టాలీవుడ్ డ్రగ్ కేసు విచారణ జరుగుతోంది. ఆ సమయంలో బిగ్ బాస్ ఇంట్లో ఉన్న ఐటమ్ బ్యూటీ ముమైత్ ఖాన్ నోటీసులు అందాయి. ఆమె నేరుగా బిగ్ బాస్ ఇంటి నుంచి వచ్చి విచారణకు హాజరై వెళ్లింది. ఇప్పుడు బాబు గోగినేని ఈ కేసు విషయంలో బయటికి వచ్చి వెళ్లాల్సి ఉంటుందేమో చూడాలి.