బిగ్ బాస్ 2 నుంచి బాబు బ‌య‌ట‌కు రాన‌ట్టే.. !!

హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగ‌తి తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీవీఛానళ్లు, సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తుండటంతో పాటు తన సమావేశాలకు వచ్చిన జనం నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఆధార్‌కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని అతనిపై మాదాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త వీరనారాయణ ఫిర్యాదు చేశారు. .

హేతువాది, మానవతావాదిగా చెప్పుకొంటున్న రాజాజీ రామనాథ బాబుగోగినేని ఇటీవల వైజాగ్‌, హైదరాబాద్‌, బెంగళూరుల్లో నిర్వహించిన నేషనల్‌ డే ఆఫ్‌ హ్యూమనిజం, హ్యూమనిస్ట్సు గెట్‌టుగెదర్‌ సమావేశాలకు వచ్చిన వారి ఆధార్‌కార్డు నెంబర్లు సేకరించాడు. ఇది ప్రభుత్వం యుఐడీఏఐ నిబంధనలకు విరుద్ధమని, బాబు గోగినేనిపై చర్యలు తీసుకోవాలని వీరనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం మాదాపూర్‌ పోలీసులు బాబుగోగినేనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో బాబు గోగినేనికి పోలీసులు నోటిసులు పంపిస్తార‌ని, బిగ్ బాస్ 2 షో నుంచి ఆయ‌న ఇక బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో హైకోర్టు ఉత్త‌ర్వులు ఈ ప్ర‌చారానికి పుల్ స్టాప్ పెట్టేశాయి. బిగ్ బాస్ 2 షోలో కొనసాగుతున్న బాబు గోగినేని పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వీరనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గోగినేని న్యాయవాదలు వీరనారయణవేసిన పిల్ కు కౌంటర్ దాఖలు చేశారు.

దీంతో బాబు గోగినేనికి హైకోర్టులో ఊరట లభించింది. మాదాపూర్ లో నమోదైన కేసు పై త‌దుప‌రి దర్యాప్తు రెండు నెలల పాటు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో రెండు నెలల పాటు బాబు గోగినేని ఇక బిగ్ బాస్ 2 షో నుంచి బయటకు రావాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది.