టీఆర్ఎస్ ఇచ్చిన సంకేతం అదేనా..?
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం సందర్భంగా టీఆర్ఎస్ వైఖరిపై ముందు నుంచీ సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. అవిశ్వాసంపై ఓటింగ్ లో ఆ పార్టీ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి, టీఆర్ఎస్ పార్టీకి అంతర్గత ఒప్పందం ఉందంటూ ముందునుంచీ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కు చెందిన పదకొండు మంది ఎంపీలు ఓటు వేయడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోందంటున్నారు విశ్లేషకులు. మోడీ, గీడీ ఏంటని దుయ్యబట్టిన టీఆర్ఎస్ ఇప్పుడు మోడీకి అనుకూలంగా ఓటు వేయడమేంటనే ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. అదీగాక ప్రధాని ఈ అవిశ్వాస పరీక్షను కాంగ్రెస్ వైపు ఎవరున్నారనే పరీక్షగా అభివర్ణించడం కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
తెలంగాణ ప్రాంత మనోభావాలను, హక్కులను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తామని, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వమని ముందునుంచీ టీఆర్ఎస్ చెబతున్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలను చూసుకున్నా అవిశ్వాసానికి ఓటు వేయకుండా తటస్థంగా ఉండాల్సిందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అవిశ్వాసంపై ఓటింగ్ నేపథ్యంలో అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయడంపై ఆ పార్టీ నైతికతకు భంగం కలిగేలా వ్యవహరించడమే కాకుండా విపక్షాల ఆరోపణలకు బలం చేకూర్చేలా టీఆర్ఎస్ వ్యవహరించిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.
తటస్థ వైఖరిని అవలంభించకుండా కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు టీఆర్ఎస్ అలా చేసినప్పటికీ అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయడం బీజేపీతో అంతర్గత ఒప్పందం ఉన్నట్లు సంకేతాలిచ్చినట్లుగా భావించాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూ విమర్శల వర్షం కురిపిస్తున్న బీజేపీకి, ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీ క్రెడిబిటీని దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు అంచాన వేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు రాజకీయంగా కాంగ్రెస్ ఉపయోగించుకునే అవకాశమూల లేకపోలేదు.
ముందు నుంచీ చెబుతున్నట్లే టీఆర్ఎస్, బీజేపీకి మధ్య ఒప్పందం ఉందనే వాదనకు ఈ పరిణామం బలం చేకూర్చేలా ఉందన్నది మాత్రం నిజం. ఇదంతా గమనిస్తున్న తెలంగాణ ప్రజానీకం ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకుంటే ఫలితం అలా ఉంటుందనేది వాస్తవం. చూడాలి మరి వారికెలా అర్థమైందో వచ్చే ఎన్నికల్లో ఫలితం ఎవరికి అనుకూలంగా ఇస్తారో…