కొత్తగా 9200 గ్రామ కార్యదర్శి పోస్టుల భర్తీ
తెలంగాణలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. రాష్ట్రంలో కొత్తగా 9200 గ్రామ కార్యదర్శి పోస్టులను భర్తీ చేయనునున్నారు. వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉద్యోగ ప్రకటన రానుంది. రెండు నెలల్లోనే నియామక ప్రక్రియని పూర్తి చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీల బాధ్యతల్ని నిర్వర్తించేందుకుగాను ప్రతి గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా కార్యదర్శి ఉండాలన్న ఉద్దేశంతో ఈ నియామకాలను చేపడుతున్నట్లు సీఎం తెలిపారు.
ఆదివారం ప్రగతిభవన్‌లో పంచాయతీరాజ్‌శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. వాటిలో 3562 పంచాయతీలకు మాత్రమే కార్యదర్శులున్నారు. ఇటీవల కొత్తగా మరిన్ని గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశాం. కొత్తవాటితోపాటు అన్ని గ్రామాలకు ప్రత్యేకంగా పంచాయతీ కార్యదర్శులుండాలి. అందుకే కొత్తగా 9,200 మంది పంచాయతీ కార్యదర్శులను నియమిస్తాం’ అన్నారు.
కొత్తగా నియమితులయ్యే పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉండనుంది. ప్రొబేషన్ సమయంలో నెలకు రూ.15,000 చొప్పున జీతం ఇవ్వాలని నిర్ణయించారు. వారి పనితీరు ఆధారంగానే క్రమబద్ధీకరించనున్నారు. నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేడర్‌లో నియామకాలు జరపాలని సీఎం సూచించారు. జిల్లా కేడర్‌లోనే ఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.