కాంగ్రెస్ ‘హోదా’ వ్యూహం ఫలిచేనా..?

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలో అధికారం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు జాతీయ కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఆదివారం జ‌రిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది ఆ పార్టీ. రాహుల్ ను ప్ర‌ధాని చేయ‌డానికి ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పొందుప‌ర్చాల్సిన అంశాల‌పై దాదాపుగా క్లారిటీకి వ‌చ్చింది. తెలంగాణ‌తో పోలిస్తే ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులన్నీ హోదా అంశం చుట్టే తిరుగుతున్నాయి. స‌రిగ్గా ఈ అంశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప‌నిలో ప‌డింది కాంగ్రెస్.

ఏపీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ త‌మ‌కు అన్యాయం చేసింద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌త్యేక హోదా అంశ‌మే ఎజెండాగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. రాహుల్ తో హోదా ప్ర‌క‌ట‌న‌చేయించి ప్ర‌జ‌ల దృష్టిలో మార్కులు కొట్టేయాల‌ని అనుకుంటోంది కాంగ్రెస్. ఇప్ప‌టికే ప‌లు చేరిక‌ల‌తో కాంగ్రెస్ ను ఏపీలో బ‌లోపేతం చేయ‌డ‌మే కాకుండా , హోదా ప్ర‌క‌ట‌న‌తో కాంగ్రెస్ కు పూర్వ వైభ‌వం తీసుకు వ‌చ్చేలా ప్లాన్ చేస్తోంది ఆపార్టీ. ఇటు తెలంగాణ‌లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలే ఎజెండాగా ముందుకు వెళ్లాల‌ని భావిస్తోంది.

హోదా ప్ర‌క‌ట‌న వ‌ల్ల తెలంగాణ‌లో న‌ష్ట‌పోకుండా ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌నుంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌ట‌నతో తెలంగాణ‌కు వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదనే అంశాన్ని ముందుగా తెలంగాణ ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని భావిస్తోంది. లేక‌పోతే అధికార టీఆర్ఎస్ ఈ అంశాన్ని ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను, ఉద్య‌మ తీవ్ర‌త‌ను గ‌మ‌నించి రాష్ట్ర ఏర్పాటు చేశామ‌ని, ప్ర‌స్తుతం ఏపీ విష‌యంలో కూడా అలాగే ముందుకెళుతోంద‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాల‌ని భావిస్తోంది.

విభ‌జ‌న హామీల‌పై కూడా తెలంగాణ‌లో స్ప‌ష్ట‌త‌నిచ్చి, హోదా అంశం ఇప్పుడు కొత్త‌గా తెర‌పైకి తీసుకు వ‌చ్చింది కాద‌నే అంశాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించేలా చూడాల‌ని తెలంగాణ నేత‌ల‌కు ఆ పార్టీ సూచించిన‌ట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ప్ర‌త్యేక హోదా వ్యూహం తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఏ మేర‌కు ఫ‌లితాల‌ను తీసుకు వ‌స్తుందో చూడాలి.