ధోనీ స్థానాన్ని భర్తీ చేసేదెవరు ?

మాజీ కెప్టెన్‌ ధోనీ మునుపటిలా వేగంగా ఆడలేకపోతున్నాడు. బెస్ట్‌ ఫినిషర్‌గా పేరున్న ధోనీలో మునుపటి వేగం కనిపించడం లేదు. ఇంగ్లాండ్‌తో వన్ డే సీరీస్ తో ఈ విషయం అర్థమయింది. ఈ సిరీస్ లో ధోనీ ప్రదర్శనపై చాలామంది పెదవి విరిచారు. ధోని ఆట ఇలాగే కొనసాగితే.. 2019 ప్రపంచకప్‌ జట్టులో అతనికి స్థానం దక్కడం కష్టమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా, ధోనీ ప్రదర్శనపై మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ స్పందించాడు. వచ్చే ప్రపంచకప్‌కు జట్టులో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరూ సిద్ధంగా లేరంటూ సచిన్‌ అభిప్రాయపడ్డారు.

ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ ఈ కామెంట్స్ చేశారు. ప్రపంచకప్‌ దాదాపు సంవత్సరం దాకా సమయం ఉంది. ప్రపంచకప్‌లో ధోనీ ఆడాలా ? వద్దా ? అనేది తనకు తానే నిర్ణయించుకోగలడు. ప్రపంచకప్‌లో ధోనీకి ప్రత్యామ్నాయంగా ఎవరూ లేరు. దినేశ్‌ కార్తీక్ కొంతకాలంగా జట్టులో స్థానం దక్కించుకుంటున్నా.. అతనికి వన్డే క్రికెట్‌లో ఆడే అవకాశాలు అంతగా రావటం లేదు. అయితే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అతని ప్రదర్శనే వన్డేల్లో అతని భవిష్యత్తును నిర్ణయించేలా ఉందని సచిన్‌ చెప్పుకొచ్చాడు.