మళ్లీ సెంటిమెంట్ పై గురి పెట్టిన టీఆర్ఎస్..!!
రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు ప్రభుత్వ వైఫల్యాలపై విపక్షాలు విరుచుకుపడితే ఇప్పుడు విపక్షాలపైనే అధికార టీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కు మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రంగా ఉపయోగపడుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంతో తెలంగాణ ప్రయోజనాల సంగతేంటంటూ రెండు జాతీయ పార్టీలను ప్రశ్నిస్తోంది టీఆర్ఎస్.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ కాంగ్రెస్ చెప్పడం, సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ మాటేమిటంటూ టీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీల టార్గెట్ ప్రాంతీయ పార్టీలేనని, రాష్ట్రంలో పాగావేసేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెల్లడం మొదలు పెట్టింది అధికార టీఆర్ఎస్. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కంపెనీలన్నీ ఆంధ్రాకు తరలిపోతాయనే నినాదాన్ని అందుకుంది అధికార పార్టీ.
కాంగ్రస్ తెలంగాణను ఇచ్చినా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పై ప్రజల్లో పాజిటివ్ అభిప్రాయం వచ్చేలా చేయడంలో ఆపార్టీ విపలమైంది. దీంతో తెలంగాణ సాధించిన పార్టీగ అధికారం టీఆర్ఎస్ ను వరించింది. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టిపెడుతూనే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని టీఆర్ఎస్ చేతికిచ్చింది కాంగ్రెస్. అయితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు సరిగ్గా వివరించలేకపోతే మాత్రం తెలంగాణ సెంటిమెంటే టీఆర్ఎస్ కు మళ్లీ అధికారం తెచ్చిపెట్టడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.