డైలామాలో తెలంగాణ బీజేపీ…!?
కేంద్రంపై అవిశ్వాసం ఏపీలో రాజకీయంగా ఎవరికెంత లాభం చేసిందనేది పక్కనబెడితే.. తెలంగాణలో మాత్రం బీజేపీ వైఖరిపై ప్రజల్లో ఒక డైలామా నెలకొందనేది వాస్తవం. అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడుతూ బీజేపీ చేసిన జనచైతన్య యాత్రతో ఒకింత బీజేపీ ఇమేజ్ ను పెంచుకున్న ఆ పార్టీకి కేంద్రం వైఖరితో ఆ కాస్త మైలేజ్ కూడా దక్కకుండా పోయేలా ఉంది. రాష్ట్రంలో బీజేపీ ఒకడుగు ముందుకేస్తే కేంద్రం రెండడుగులు వెనక్కి లాగుతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది.
రాష్ట్ర బీజేపీ నేతలు అధికార టీఆర్ఎస్ పై చేసిన విమర్శలపై పార్లమెంటు సాక్షిగా మోదీ ఒక్కసారిగా నీళ్లు చల్లారని పార్టీ నేతల్లో ఓ చర్చ మొదలైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో టీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరిణితి చెందిన నేత అంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా రాష్ట్రంలో ఆ పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుందనే చెప్పాలి. ఏపీ సీఎం చంద్రబాబుతో పోల్చుతూ ప్రధాని ఆ వ్యాఖ్యలు చేసినప్పటికీ టీఆర్ఎస్ కు ఇది మైలేజీని తెచ్చిపెట్టింది. మరో వైపు టీఆర్ఎస్ నేతలు ప్రదాని ప్రశంసను ఓ రేంజ్ లో ప్రచారం చేసుకుంటున్నారు కూడా. దీంతో బీజేపీ పరిస్థితి ఆత్మహత్యా సదృశంగా తయారైందని అనుకుంటున్నారు విశ్లేషకులు.
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న బీజేపీ నేతలకు ప్రధాని వ్యాక్యలతో పిడుగు మీద పడినంత పనయ్యింది. అధికార పార్టీ పై దూకుడుగా వ్యవహరించాలని చెబుతూనే కేంధ్ర ప్రభుత్వంలోని పెద్దలే కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడాన్ని రాష్ట్రంలో బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు టీఆర్ఎస్ తో పోరాడాలా లేదా అనే సందిగ్ధంలో పడిపోయాలు ఆ పార్టీ నేతలు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందన్న వాదనకు ఆ పార్టీ ద్వంద్వ వైఖరి అద్దంపడుతోందనేది ఇతర పార్టీల విమర్శ. మరి ఈ విమర్శలను బీజేపీ ఎలా తిప్పికొడుతుంది, అధికార పార్టీపై ఎలా పోరాడుతుందో చూడాలి.