ఏపీలో వైసీపీ’దే ఆధిక్యం

వచ్చే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. పది నెలల సమయం మాత్రమే ఉంది. దీనికి తోడు ముందస్తుపై ఆలోచనలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఆ పరిస్థితి కనబడటం లేదు. ముందస్తుకు తొందరెందుకు ? అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఐతే, ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలొస్తే గెలుపెవరిది.. ? అంటే వైసిపి ఆధిక్యం సాధిస్తుందని చెబుతున్నారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్.

నాలుగేళ్ళలో టీడీపీపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగింది. తక్షణం ఎన్నికలు పెడితే టిడిపి – వైసీపీల నడుమే పోటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలోకి వెళ్లలేదన్నారు ఉండవల్లి. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఉండవల్లి ఏపీ రాజకీయాలపై ఓపెన్ గా మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో వైసీపీకి ఆధిక్యం దక్కుతుందని చెప్పుకొచ్చారు. లోక్ సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చపై ఉండవల్లి పెదవి విరిచారు. టీడీపీ ఎంపీలు ఇంకా బాగా పోరాడాల్సివుందని అన్నారు.

విభజన చేసిన తీరు ను నిలదీసి దానిపైనే చర్చ కొనసాగించే ధైర్యం టీడీపీ చేయలేకపోతుంది. విభజన పై పార్లమెంట్లో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలనే అస్త్రాలుగా ప్రయోగిస్తే బిజెపి, కాంగ్రెస్ లు సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్ లో పడేవన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికి పార్లమెంట్లో అవకాశం ఉంది. ప్రశ్నోత్తరాల సమయం, ప్రివిలేజ్ ఇంకా అనేక రకాల ఎత్తుగడలతో మోడీ సర్కార్ పై దాడి చేయొచ్చని ఉండవల్లి సూచించారు.

ఇటీవల కాలంలో ఉండవల్లి జనసేన పార్టీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగింది. ప్రత్యేక హోదాపై పవన్ వేసిన కమిటీకి ఉండవల్లి మార్గనిర్థేశకులుగా వ్యవహరించారు. ఆ సమయంలో ఉండవల్లి జనసేనకు సపోర్టుగా కనిపించారు. .ఇక, పార్లమెంట్ సమావేశాలకు ముందు ఉండవల్లిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకొని చర్చించారు. ఆ సమయంలో ఆయన టీడీపీ లో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది. ఉండవల్లి మాత్రం పవన్ పిలిస్తే వెళ్లాను. చంద్రబాబు పిలిస్తే వెళ్లాలనని చెప్పి.. తన పొలిటికల్ రీ-ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగేలా చేశారు.