భాజపానే యూటర్న్ తీసుకుంది


‘యూ టర్న్’ తీసుకొంది ఎవరు ? కేంద్రమా.. ?? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునా.. ?? ఇప్పుడీ విషయంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో బీజేపీ యూ టర్న్ తీసుకొందని టీడీపీ ఆరోపిస్తోంది. ఐతే, ముఖ్యమంత్రి చంద్రబాబునే ‘యూ టర్న్’ తీసుకొన్నారని అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించిన చంద్రబాబు.. ఇప్పుడు మాట మార్చారని మోడీ అన్నారు.

తాజాగా, దీనిపై చంద్రబాబు స్పందించారు. విభజన హామీల విషయంలో భాజపానే యూటర్న్ తీసుకుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీకి ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకోవడం, మేనిఫెస్టోలో చెప్పింది చేయకపోవడం, పదేళ్లు హోదా ఇస్తామని చెప్పి… ఇప్పుడు కుదరదని చెప్పడం.. ఇవన్నీ యూటర్న్‌ కాదా? అని ప్రశ్నించారు. ఈ ఉదయం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించారు. పార్లమెంటులో తెదేపా ఎంపీల పోరాటంపై ప్రజల్లో ప్రశంసలు వచ్చాయి. ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎంపీలు అత్యున్నత చట్టసభల్లో ఎండగట్టారని.. తమకు అప్పగించిన బాధ్యతను పకడ్బందీగా నిర్వర్తించారని కొనియాడారు.

ఇకపై కూడా పార్లమెంటులో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. శూన్యగంట, ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించాలని దిశానిర్దేశం చేశారు. ఇక, ఒంగోలులో ధర్మపోరాట సభకు ఎంపీలందరూ హాజరుకావాలని ఆదేశించారు.