అమెరికాలో హైద్రాబాది అదృశ్యం

సంతోష్‌నగర్‌ ఎం.బి.హట్స్‌కు చెందిన మెరాజ్‌ బేగం, మహ్మద్‌ ఇస్మాయిల్‌ల నాల్గవ కుమారుడు మీర్జా అహ్మద్‌ అలీబేగ్‌ (26) 2014లో బీటెక్‌ పూర్తి చేసి 2015 జూలై 23న యూఎస్‌ వెళ్లాడు. అక్కడ ఎంఎస్‌ చదువుకుంటూ మొబైల్‌ షాపులో గత 6 నెలలుగా పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడు.

ఈ నెల 20న రాత్రి 9 గంటలకు ఫోన్‌ చేసిన అహ్మద్‌ తాను ఇబ్బందుల్లో ఉన్నానని తల్లిదండ్రులకు చెప్పాడు. అది మీకు చెప్పేవి కాదని, తమ్ముడు సుజీత్‌ బేగ్‌ వచ్చాక మళ్లీ ఫోన్‌ చేసి చెబుతానని పెట్టేశాడు. అనంతరం సుజీత్‌ బేగ్‌ ఫోన్‌ చేయగా అందుబాటులోకి రాలేదు. ఆందోళ నకు గురైన వారు యూఎస్‌లో ఉన్న స్నేహితులు, మొబైల్‌ షాపు నిర్వా హకునికి ఫోన్‌ చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడంటూ పొంతనలేని సమాధానాలు చెప్పారు.

యూఎస్‌లోని అహ్మద్‌ రూమ్మేట్‌కు ఫోన్‌ చేయగా… అదృశ్యంపై న్యూజెర్సీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అక్కడి పోలీసులు రూమ్‌ను పరిశీలించగా.. ఆధారాలు, పాస్‌ పోర్టు లభించలేదని చెప్పాడు. ఈ విషయమై భారత రాయబారి కార్యాలయం, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాసినట్లు అహ్మద్‌ తండ్రి మహ్మద్‌ ఇస్మాయిల్‌ తెలిపారు.