‘సైరా’ రాత్రి పోరాటాలు.. అద్భుతం !

మెగాస్టార్ చిరంజీవి గత కొద్దిరోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాత్రుల్లో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. బ్రిటీష్ సైనికులని మట్టికరిపిస్తున్నాడు. ఇప్పుడా యుద్ధం ముగిసింది. ఆ పోరాటాలు ఎంత భయంకరంగా ఉన్నాయి అన్నది ఒక్క ఫోటోతో చూపించారు సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు. ‘సైరా’ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యిందని రత్నవేలు తెలిపారు. ఈ సందర్భంగా సెట్‌లో తీసిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు.

“35 రాత్రుల సవాలుతో కూడిన షెడ్యూల్‌ పూర్తయింది. వర్షంలో బ్రిటిష్‌ సైనికులకు వ్యతిరేకంగా పోరాటం చేశాం. అద్భుతమైన నిర్మాణ విలువలతో భారీ యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కించాం. అతి తక్కువ కాంతిలో షూటింగ్‌ జరిగింది.. అద్భుతం. ‘సైరా’..” అని ఆయన ట్వీట్‌ చేశారు. రత్నవేలు షేర్‌ చేసిన ఫొటో చూస్తే ఎలాంటి వాతావరణంలో షూటింగ్‌ జరిగిందో అర్థమవుతుంది. స్టిల్‌లో చీకటిలో గుర్రాలపై వెళ్తున్న వ్యక్తులు కనిపించారు. ఈ షెడ్యూల్ లో బ్రిటీషర్లపై ఆదిపత్యం కోసం ‘సైరా’ అలుపెరుగని పోరాటం చేశారు.

స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుధీర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్‌ సన్నివేశాల కోసం హాలీవుడ్‌ నిపుణుడు గ్రాగ్‌ పావెల్‌ పనిచేస్తున్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘సైరా’ టీజర్ ని విడుదల్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, సినిమాని సంక్రాంతి లేదంటే వేసవికి విడుదల చేయనున్నారు.