రివ్యూ : హ్యాపీ వెడ్డింగ్

చిత్రం : హ్యాపీ వెడ్డింగ్ (2018)

నటీనటులు : సుమంత్ అశ్విన్, నిహారిక

సంగీతం : శక్తికాంత్ కార్తీక్

దర్శకత్వం : లక్ష్మణ్ కార్య

నిర్మాతలు : ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణా రెడ్డి

రిలీజ్ డేటు : 28జులై, 2018.

రేటింగ్ : 2.5/5

‘కొద్దిగానే.. హ్యాపీ’ వెడ్డింగ్.. !

మెగా హీరోల లిస్టు పెద్దదే. యేడాది, రెండేళ్లకో మెగా హీరో ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. ఈ యేడాది కళ్యాణ్ దేవ్ ‘విజేత’గా ఎంట్రీ ఇచ్చాడు. మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఐతే, మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక మాత్రమే. ‘ఒకమనసు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోయిన నిహారిక ప్రయత్నం మెప్పుపొందింది. ఆమె చేసిన రెండో ప్రయత్నం ‘హ్యాపీ వెడ్డింగ్’. లక్షణ్ కార్య దర్శకుడు. సుమంత్ అశ్విన్-నిహారిక జంటగా నటించారు. నిశ్చితార్థం నుంచి పెళ్లి ముహూర్తం మధ్య 3 నెలల గ్యాప్‌లో ఎలాంటి పరిణామాలు సంభవించాయన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. నిహారిక వెడ్డింగ్ ఎలా ఉంది ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

హైదరాబాద్‌కు చెందిన అక్షర(నిహారిక), విజయవాడకు చెందిన ఆనంద్ (సుమంత్ అశ్విన్) ప్రేమించుకుంటారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకొంటారు. దీంతో ఎంగేజ్‌మెంట్ కూడా అవుతుంది. ఓ సందర్భంలో ఆనంద్ ప్రవర్తించిన తీరుతో అక్షరలో సెకండ్ థాట్ మొదలవుతుంది. ఇదే సమయంలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ (రాజా చెంబోలు) మళ్లీ సీన్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ప్రవర్తనని మార్చుకొన్నట్టు కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో తనకు ఆనంద్ సరైన వాడా ? కాదా.. ?? లేదంటే విజయ్ కరెక్టా.. ??? అనే కన్ఫూజన్ లో కి అక్షర వెళ్తుంది. పెళ్లి డేటు దగ్గర పడినా.. ఎటూ తేల్చుకోలేకపోతుంది. చివరికి వీరిద్దరిలో అక్షర ఎవరిని పెళ్లాడుతుందనేది ఎమోషన్స్ తో కూడిన మిగితా కథ.

ఎవరెలా చేశారంటే ?

‘తమకు ఏది కావాలో తేల్చుకోవడంలో నేటి తరం అమ్మాయిలు ఎలాంటి కన్ఫ్యూజన్‌కు లోనవుతున్నారు’ అనే లైన్‌ ని దర్శకుడు ఎంచుకొన్నాడు. దానికి ఎమోషనల్, లవ్ ట్రాక్ అద్ది సినిమాని నడిపించాలని భావించాడు. అదే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్ సీన్స్ ని బాగానే చూపించాడు. ఐతే, లవ్ ట్రాక్ అంత బలంగా అనిపించలేదు. కామెడీకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. సినిమాలో సుమంత్ అశ్విన్ కన్నా నిహారికకే నటించే స్కోప్ ఎక్కువగా దక్కింది. ఐతే, ఎమోషనల్ సీన్స్ నిహారిక ఇంకా మెరుగుపడాల్సి ఉంది. సుమంత్ అశ్విన్ సెటిల్డ్ గా కనిపించాడు. నిహారిక సెకండ్ థాట్ విజయ్‌గా రాజా చేబోలు ది గెస్ట్ రోల్ నే.

సినిమా విడుదలకు ముందు మురళీ శర్మ నటన ఆహా.. ఓహా అన్నారు. ఐతే, ఆయన్ని దర్శకుడు సరిగ్గా వాడుకోలేదనిపించింది. తులసి శివమణి, పవిత్రా లోకేష్, నరేష్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరో నాన్నమ్మగా సీనియర్ నటి అన్నపూర్ణ డబుల్ మీనింగ్ డైలాగులతో కామెడీ పండించే ప్రయత్నం చేసింది. సెకలాజిస్ట్‌గా కనిపించిన ఇంద్రజ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

చాలా మంచి పాయింట్ తో కథని రాసుకొన్నాడు దర్శకుడు లక్ష్మణ్ కార్య. ఈ తరంకు ఎక్కే కథ ఇది. ఐతే, దాన్ని పండించడంలో కొద్దిగా మాత్రమే విజయవంతం అయ్యారు. సినిమా ఫస్టాఫ్ సరదా సరదా సాగింది. ఆ తర్వాత నిహారిక కన్ఫూజన్ తో ప్రేక్షకులని కన్ఫూజన్ లో పడేసింది. ఇక, టెక్నికల్ గా అన్నీ బాగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. శక్తికాంత్ కార్తీక్ అందించిన పాటలు ఓకే. సినిమా సాగదీత సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటికి కత్తెరపెడితే బాగుణ్ణు. యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటమ్ లైన్ : ‘కొద్దిగానే.. హ్యాపీ’ వెడ్డింగ్.. !

రేటింగ్ : 2.5/5