బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్… !
ప్రభుత్వ విద్యాలయాల్లో పూర్తిగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతోందని, గత పాలనలో భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థను గాడిన పెడుతున్నామని ఆయన చెప్పారు. గత నాలుగేళ్ల కృషికి ఇప్పుడిప్పుడే ఫలితాలొస్తున్నాయని ఆయన అన్నారు. ఈ నాలుగేళ్లలో 570 గురుకులాలు కొత్తగా ఏర్పాటయ్యాయని, ఈ ఏడాది నుంచి 33 గురుకులాలు, 85 కేజీబీవీలు జూనియర్ కాలేజీలయ్యాయని ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది 119 బీసీ గురుకులాలు ఏర్పాటు కానున్నాయని, మరో 27 సాధారణ గురుకుల విద్యాలయాలకు సిఎం సుముఖత తెలిపారని కడియం చెప్పారు. నాణ్యమైన విద్య అందించేందుకు గురుకుల వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని, ప్రభుత్వ విద్యాలయాల్లోని బాలికలకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. 7వ తరగతి నుంచి ఇంటర్ వరకుబాలికలకు ఏటా రూ.100 కోట్లతో 6 లక్షల మందికి కిట్స్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.