నిర్మాత కె. రాఘవ ఇకలేరు

ప్రముఖ నిర్మాత, ప్రతాప్‌ ఆర్ట్స్‌ అధినేత కె. రాఘవ (105) గుండెపోటుతో మృతిచెందారు. అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోటిపల్లి అనే గ్రామంలో 1913లో ఆయన జన్మించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థని స్థాపించిన రాఘవ చిత్ర రంగంలో విజయవంతమైన నిర్మాతగా కీర్తిని పొందారు. సుఖదుఃఖాలు, జగత్‌ కిలాడీలు, తాత మనవడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చదువు సంస్కారం, అంతులేని వింతకథ, అంకితం, ఈ ప్రశ్నకు బదులేదీ వంటి అనేక చిత్రాలను నిర్మించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం తొలి పాట పడిన సుఖ దుఃఖాలు చిత్ర నిర్మాణంలో రాఘవ కూడా భాగస్వామి. బాలనాగమ్మ, చంద్రలేఖ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు రాఘవకు నివాళులు అర్పించారు.