ఉత్త‌మ్, జానా త‌ప్ప అంతా కారెక్క‌డానికి సిద్ధంగా ఉన్నారు..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై రివ‌ర్స్ ఎటాక్ చేశారు. టీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఉత్త‌మ్ వ్యాఖ్యానించ‌డంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉత్తమ్ కు తగదని, వారు చేస్తున్న అవినీతి ఆరోపణలపై ఆధారాలుంటే బయటపెట్టాలని కేటీఆర్ అన్నారు. ఎన్నికల ముందు ఏదో ఒకటి అనాలి కాబ‌ట్టి విమర్శలు చేస్తున్నారని ఆయ‌న అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడాలంటే తానూ మాట్లాడ‌గ‌ల‌న‌ని, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు రాహుల్ అని తాను అనొచ్చని ఆయ‌న చెప్పుకొచ్చారు. కాళేశ్వరం నీళ్లు వస్తే వారి కుర్చీల కిందకు నిలొస్తాయని ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు.

ఉత్తమ్, కోదండ రాం శిక్షలు వేసేవారు కాదని, కాంగ్రెస్ పార్టీ బెయిల్ గాడీ లాంటిదని కేటీఆర్ అన్నారు. శరవేగంగా ప్రాజెక్టులు కడుతుంటే వారికి మింగుడుపడటం లేద‌ని, అభివృద్ధి చూసి ఓర్వలేక కడుపుమంటతోనే విమర్శలు చేస్తున్నార‌న్నారాయ‌న‌. కాంగ్రెస్ ఫ్లోరోసిస్ అంట‌గ‌డితే తాము ఇంటింటికి తాగు నీరు అందిస్తున్నామ‌ని , త‌మ ప‌నితీరుకు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో నీటితో క‌ళ‌క‌ళ‌లాడుతున్న ప్రాజెక్టులు, చెరువులే నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ హక్కుల విషయంలో కూడా కేంద్ర స్థాయిలో పోరాడాలని, ఏ పనిచేయాలన్నా ఢిల్లీ వైపు చూసే కాంగ్రెస్ ను ప్రజలు నమ్మరని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఢిల్లీకి దాసులైన కాంగ్రెస్ కు ప్రజలు మద్దతు ఇవ్వ‌ర‌ని, సొంత పార్లమెంట్ నియోజకవర్గంమైన అమేథీలోనే మున్సిపాలిటీని గెలిపించుకోలేని రాహుల్ ఇక్కడికి వచ్చి పొడిచేది ఏమీలేదన్నారు కేటీఆర్. డీఎస్ విషయం అధిష్టానం చూసుకుంటుందన్నారు కేటీఆర్. ఫెడరల్ ఫ్రంట్ ఇంకా ఉందని, ఉత్తమ్ జానా తప్పా మిగిలిన నేతలంతా కారు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ ఆ కాంగ్రెస్ నేతలకు త‌మ‌ పార్టీలో చోటులేదని చెప్పారు మంత్రి కేటీఆర్.