ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ టూ కేరీర్ గైడెన్స్ సెంట‌ర్..!

ఒక‌ప్పుడు ఎంతో డిమాండ్ ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కేంద్రాలు ఇప్పుడు కేవ‌లం అలంకార ప్రాయంగానే మారిపోయాయి. ప‌దోత‌ర‌గ‌తి పాసైన వారితోపాటు డిగ్రీలు పొందిన వారు కూడా ఎంప్లాయిమెంట్ కార్యాల‌యంలో ఎన్ రోల్ చేయించుకునేవారు. ఆ త‌రువాత ప్ర‌తీ సంవ‌త్స‌రం రిన్యూవ‌ల్ చేసుకునేవారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ లో న‌మోదు త‌ప్ప‌నిస‌రిగా ఉండేది. అయితే ఇప్పుడు కాలం మారింది.. క్యాంప‌స్ సెల‌క్ష‌న్లు, ఆన్లైన్ ద‌ర‌ఖాస్తులు వ‌చ్చేస‌రికి ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కేంద్రాలకు ప‌నిలేకుండా పోయింది.

అయితే ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కేంద్రాల‌కు కొత్త రూపును ఇవ్వాల‌ని యోచిస్తోంది ఏపీ ప్ర‌భుత్వం. ఇప్పటికే స్కిల్‌ డెవల్‌పమెంట్‌కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. యువత నైపుణ్యానికి మెరుగులు దిద్దుతోంది. ఐటీఐ లాంటి కోర్సులు చేసిన వారికి మెరుగైన శిక్షణ ఇస్తే వారి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు బాట వేసినట్లు అవుతుందని భావించిన కార్మిక శాఖ ఇటీవలే రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ కేంద్రాల‌ను కెరీర్ గైడెన్స్ కేంద్రాలుగా మార్చాల‌న్న ప్ర‌తిపాద‌న‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఆమోదించింది. ముందుగా అనంతపురం, చిత్తూరుల్లో ఇలా కెరీర్‌గైడెన్స్‌ కేంద్రాలుగా మార్చుతున్నట్లు కార్మికశాఖ కమిషనర్‌ వరప్రసాద్‌ తెలిపారు.