రివ్యూ : చి.ల.సౌ.
చిత్రం : చి.ల.సౌ. (2018)
ననటీటులు : సుశాంత్, రుహాని శర్మ
సంగీతం : ప్రశాంత్ విహారి
దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్
నిర్మాత : అక్కినేని నాగార్జున, జస్వంత్ నాడిపల్లి, భరత్ కుమార్
రిలీజ్ డేటు : 03 ఆగస్టు, 2018.
రేటింగ్ : 4/5
సుశాంత్ పక్కా కమర్షియల్ ఫార్ములా సినిమాలు చేశాడు. కాళీదాసు, కరెంట్, అడ్డా, దొంగాట, ఆటాడుకొందా రా సినిమాలు చేశాడు. వీటిలో ‘కరెంట్’ సినిమా ఒక్కటే ఓ మోస్తరుగా ఆడింది. ఈ సారి సుశాంత్ తనకి తగ్గ ఓ సున్నితమైన కథని ఎంచుకొని ‘చి.ల.సౌ’ చేశాడు. నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాని నాగార్జున టేకప్ చేయడం. అన్నపూర్ణ బ్యానర్ పై విడుదల చేయడంతో ‘చి.ల.సౌ.’ పై అంచనాలు పెరిగాయి. దీనికితోడు అక్కినేని కుటుంబ సభ్యులు నాగ చైతన్య, సమంత, అఖిల్.. చి.ల.సౌ. కోసం రంగంలోగి ప్రమోషన్ చేశారు. దీంతో విడుదలకు ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొంది. పాజిటివ్ టాక్ తో ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో సుశాంత్ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడా..? దర్శకుడిగా తొలి ప్రయత్నంలో రాహుల్ రవీంద్రన్ సక్సెస్ అయ్యాడా..? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ… !
కథ :
పెళ్లంటే ఇష్టం లేని ఓ అబ్బాయి… పెళ్లి తప్పనిసరి అయిన ఓ అమ్మాయి చుట్టూ సాగే కథ ఇది. అర్జున్ (సుశాంత్) మరో ఐదేళ్ల వరకు పెళ్లే వద్దని మొండికేస్తుంటాడు. ఇంట్లోవాళ్లేమో ఎలాగైన పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటారు. బలవంతంగా అంజలి (రుహానిశర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి తన కుటుంబానికి అండగా ఉంటూ ఉద్యోగం చేస్తున్న నేటితరం యువతి. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆమెకి పెళ్లి చేసుకోవడం చాలా అవసరం. అంజలిని చూసిన అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడా.. ? ఓ రోజు సాయంత్రం నుంచి ఉదయం వరకు జరిగిన ప్రయాణంలో వీరిద్దరి జీవితాలు ఏ మలుపు తిరిగాయి అన్నది చి.ల.సౌ చిత్ర కథ.
ఎలా ఉందంటే ?
పెళ్లి చూపుల సీన్. పిల్లని చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుక్కి అసలు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. పెళ్లి కూతురికి మాత్రం పెళ్లి చేసుకోవడం చాలా అవసరం. ఈ పాయింట్ కి ఎమోషన్స్ జోడించి ఒక్కరోజు జరిగే కథగా చూపించడం గొప్ప ప్రయత్నమే. ఆ ప్రయత్నంలో విజయం సాధించాడు రాహుల్ రవిచంద్రన్. అతి సహజంగా, అసలు హీరో-హీరోయిన్స్ మేకప్ కూడా లేకుండా సినిమా తీశాడు. అర్జున్ బ్రేకప్ తర్వాత జరుగుతున్న విషయాలను, తాను పడే మానసిక సంఘర్షణ గురించి చెప్పడంతో కథ ప్రారంభమవుతుంది. చాలా కామ్‌గా ప్రేక్షకుడు లీనమయ్యే విధంగా కథ ముందుకెళ్తుంది.
అంజలితో పెళ్లిచూపులతో భావోద్వేగమైన కథ ఆరంభమవుతుంది. ఓ సన్నివేశానికి, మరో సన్నివేశానికి ఎమోషనల్ స్థాయి పెంచుకొంటూ పోవడంతో ఓ మంచి సినిమా చూస్తున్నాననే అనుభూతిలో ప్రేక్షకుడు ఉంటాడు. వెన్నెల కిషోర్ కామెడీతో మరింత ప్లస్ అయ్యింది. సినిమా కాస్త తగ్గుతుందనిపించిన ప్రతిసారీ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చి నవ్వులు పూయించాడు. రెండో భాగంలో రొమాంటిక్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. హాస్పిటల్‌లో జరిగే డ్రామా ఆసక్తిగా సాగింది. పోలీస్ స్టేషన్ ఏపీసోడ్ , అంజలి ఫ్లాష్‌బ్యాక్ ఏపీసోడ్ ప్రేక్షకుడిని భావోద్వేగంలో బంధిస్తాయి. మంచి ఎమోషనల్ రొమాంటిక్ సీన్ తో క్లైమాక్స్ ని ప్లాన్ చేశాడు దర్శకుడు.
ఎవరెలా చేశారంటే ?
అర్జున్ పాత్రలో సుశాంత్ ఒదిగిపోయాడు. నటనలో మంచి పరిణతి కనబరిచాడు. ఆయన కామెడీ టైమింగ్ బాగా కుదిరింది. హీరోయిన్ రుహానిశర్మ.. ఆమె పోషించిన అంజలి పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణ. కుటుంబ బాధ్యతలు మోస్తూ, పెళ్లి విషయంలో సంఘర్షణ పడే అమ్మాయిగా వందశాతం పాత్రలో ఇమిడిపోయింది. మేకప్ లేకుండా చాలా సహజంగా కనిపిస్తూ, అంతే సహజంగా నటించింది. ఆమె కళ్లతోనే నటించింది. ఆమె నవ్విన, తిట్టినా, ఏడ్చిన.. ప్రతిదీ బాగుంది. సినిమాలో ప్రతి ఒక్కరు మేకప్ లేకుండానే కనిపించారు. మేకప్ లేకుండా రాత్రి వేళల్లో తీసిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. వెన్నెల కిషోర్ కామెడీ బాగా పండింది. సినిమాలో జోష్ తగ్గుతోందన్న ప్రతిసారీ తెరపైకొస్తూ కడుపుబ్బా నవ్విస్తాడు వెన్నెలకిషోర్. హీరో-హీరోయిన్స్ కాకుండా సినిమాలోని మిగిలిన పాత్రలన్నీ అతిథి పాత్రలాంటివే. అవి కూడా తెరపై ఎఫెక్టివ్‌గా కనిపిస్తాయి.
సాంకేతికంగా :
ప్రశాంత్ విహారి అందించిన సంగీతం బాగుంది. భావోద్వేగ సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎన్ సుకుమార్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతీ ఫ్రేమ్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. రాత్రి వేళల్లో తీసిన సన్నివేశాలు ఆయన ప్రతిభకు నిదర్శంగా నిలిచాయి. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సాగదీత ఎక్కడ కనిపించదు. చిన్మయి చెప్పిన డబ్బింగ్ హీరోయిన్ పాత్రకు జీవం పోసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరకు.. ‘చి.ల.సౌ.’.. పెళ్లి భోజనంలా ఉంది.
రేటింగ్ : 4/5