అప్పుడు తెలంగాణ‌లో కేసీఆర్… ఇప్పుడు ఏపీలో ప‌వ‌న్ ..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ఇప్ప‌టి నుంచే పొత్తుల‌పై సంకేతాల‌నిస్తున్నాయి పార్టీలు. ఇప్ప‌టికే టీడీపీ వైఫ‌ల్యాల‌పై , చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కు కామ్రేడ్స్ తోడ‌వుతున్నారు. ఇక నుంచి పోరాట‌బాట ప‌డ‌తామంటూ ప‌వ‌న్ తో స‌మావేశ‌మైన అనంత‌రం క‌మ్యూనిస్టు పార్టీల నేత‌లు ప్ర‌క‌టించ‌డం ఏపీలో రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కేలా చేస్తోంది. ఇక ఇప్ప‌టికే జ‌న‌సేన యాత్ర‌ల‌తో ప్ర‌జ‌ల్లోకి వెళుతున్న సంగ‌తి తెలిసిందే. సిద్ధాంత ప‌రంగా క‌మ్యూనిస్టు పార్టీలు, జ‌న‌సేన పార్టీల‌కు కొంత సారుప్య‌త క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ పార్టీలు క‌లిసి ప‌నిచేసేందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ హాట్ టాపిక్ గా మారింది.

ఏపీలో ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాటాల‌ను ఉధృతం చేయ‌డంతో ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు జ‌న‌సేనాని, కామ్రేడ్స్ ప్ర‌య‌త్నిస్తున్నారు. విప‌క్ష నేత జ‌గ‌న్ తో అంత‌ర్గ‌త ఒప్పందం ఉంద‌న్న అధికార పార్టీ ఆరోప‌ణ‌ల నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌టంతో పాటు అధికార, విప‌క్ష పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించుకుంటున్నారు. సీపీఐ,సీపీఎం తో క‌ల‌సి జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకునే అవ‌కాశ‌మూ ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, ఉద్య‌మ తీవ్రంత పెంచే విష‌యాలు పొత్తుల‌పై స్ఫ‌ష్ట‌తకోసం మ‌రోమారు ఈ పార్టీలు ప‌వ‌న్ తో భేటీ కానున్నాయి.

విభజనహామీలు , కడప ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే జోన్ ల పై ఒక ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం త‌మ పోరాటాల‌ను కొన‌సాగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు కామ్రేడ్స్. ప్రభుత్వ వ్యతిరేకతను జగన్ సొమ్ము చేసుకోలేకపోవ‌డంతో జ‌న‌సేన‌తో ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని కామ్రేడ్స్ భావిస్తున్నారు. ఉమ్మ‌డి పోరాటంతో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. గ‌తంలో తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్య‌మాన్ని తారాస్థాయికి తీసుకు వెళ్ల‌డంలో టీఆర్ఎస్ తో పాటు క‌మ్యూనిస్టుల పాత్ర ఎంతో కీలకంగా మారింది. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకు వ‌చ్చి ఉద్య‌మాన్ని స‌క్సెస్ చేయ‌డంలో వారి పాత్ర గురించి చెప్ప‌న‌వ‌స‌రంలేదు. ఏపీలో కూడా కామ్రేడ్స్ జ‌న‌సేన‌తో క‌ల‌వ‌డం జ‌న‌సేకు క‌లిసి వ‌స్తుంద‌నేది విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

కాపు రిజ‌ర్వేష‌న్ అంశంతో డైలామాలో ప‌డ్డ జ‌గ‌న్ కు కాపుల్లో వ్య‌తిరేక‌త పెరిగింది. కాపుల అంశంలో ఒక ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్ల‌డ‌మే కాకుండా , విద్యార్థుల స‌మస్య‌ల‌పై పోరాడుతూ యువ‌త దృష్టిని ఆక‌ర్షించేందుకు జ‌న‌సేన సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకోసం ఇప్ప‌టికే క‌మ్యూనిస్టు పార్టీల‌తో అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాల‌తో క‌లిసి జ‌న‌సేన ఉద్య‌మాలు చేయ‌నుంది. మ‌రి క‌మ్యూనిస్టుల‌తో దోస్తీతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను జ‌న‌సేన ఏవిధంగా సొమ్ముచేసుకుంటుంది, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు జ‌న‌సేన‌కు ఎంత‌మేర మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తార‌న్న‌ది చూడాల్సిందే.