వాళ్లూ తెలంగాణలో కలుస్తామంటున్నారు..!
కొడంగల్ లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం భారీ సభను ఏర్పాటు చేసింది అధికార టీఆర్ఎస్ పార్టీ. రేవంత్ ఇలాకాలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్న టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఐదుగురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో గులాబీ గుబాలింపు కోడంగల్ లో కనిపించేలా ప్లాన్ చేశారు. సభలో మాట్లాడిన మంత్రి హరీష్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు.
కొడంగల్ కు త్వరలోనే మిషన్ భగీరథ నీళ్లు రానున్నాయని, నిరంతర కరెంటుతో పాటు ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని ఆయన అన్నారు. ఢిల్లీలో కూడా తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించే చర్చించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రగతిని చూసి ఇటు మహారాష్ట్రలో కొన్ని తెలుగు ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తెలంగాణలో కలుస్తామంటున్నారని చెప్పారు మంత్రిహరీష్.