ఎన్టీఆర్ సినిమా షూటింగ్’లో చంద్రబాబు !


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు అన్న లైన్ ఆకట్టుకుంటోంది. ఇందుకోసం ఆయన ముందస్తుగా ప్రాక్టీసు కూడా చేస్తున్నాడట. దీంతో చంద్రబాబు నటన ఎలా ఉంటుందో ? చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఐతే, ఇక్కడ చంద్రబాబు అంటే యంగ్ హీరో రానా దగ్గుపాటి. అవును.. క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపిస్తారు. ఇక, చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానా దగ్గుపాటిని తీసుకొన్నారనే ఈ ప్రచారం జరిగింది.

ఇప్పుడీ ప్రచారం నిజమేనని క్లారిటీ ఇచ్చారు రానా. శుక్రవారం రానా ఎన్టీఆర్ చిత్రబృందంతో కలిశాడు. ఈ సందర్భంగా.. ద‌ర్శ‌కుడు క్రిష్, హీరో బాల‌కృష్ణ‌తో క‌ల‌సి దిగిన ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు రానా. దీంతో చంద్రబాబు రానా అనే విషయం స్పష్టమైంది. ఇటీవలే ‘ఎన్టీఆర్’ సినిమా తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. బాలయ్య, విద్యాబాలన్ లపై కొన్ని సన్నివేశాలని చిత్రీకరించారు. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో రానా కూడా పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే రానా చంద్రబాబుని అనుకరించే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిసిందే.

ఇక, రానాకు పొలిటిక్స్ కొత్తేమీ కాదు. ఇప్పటికే తెరపై రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. లీడర్, నేనే రాజు, నేనే మంత్రి సినిమాల్లో ముఖ్యమంత్రిగా కనిపించారు. ఎత్తులు-పైఎత్తులతో ప్రత్యర్థులని చిత్తు చేశారు. ఇప్పుడు రాజకీయ చాణిక్యుడు చంద్రబాబు పాత్రలో కనిపించబోతున్నాడు. మరోసారి ముఖ్యమంత్రి క్యాండిడేటు కం ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. అంతకుమించి మహానటుడు ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని తెరపై చూపించబోతున్నాడు. చంద్రబాబు పాత్రలో రానా ఊహించుకోవడానికి కొత్తగా అనిపిస్తోంది.. ఇక చూడ్డానికి ఇంకెంత కొత్తగా ఉంటుందో… !!!