చంద్రబాబుని కలిసిన చంద్రబాబు.. !

చంద్రబాబు చంద్రబాబుని కలవడం ఏంటీ అనుకొంటున్నారా.. ? కానీ, ఇది నిజం. దీన్ని రియల్ చంద్రబాబుని రీల్ చంద్రబాబు అని చెప్పడం కరెక్ట్ నేమో.. ! క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చంద్రబాబు నాయుడుగా రానా దగ్గుపాటి కనిపించబోతున్నారు. త్వరలోనే మొదలవ్వనున్న రెండో షెడ్యూల్ లో రానా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రానా చిత్రబృందంని కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటో ఒకటి అభిమానులతో పంచుకొన్నాడు కూడా.

తాజాగా, రానా ఏపీ ముఖ్యమంత్రిని కలిశారు. దర్శకుడు క్రిష్, బాలయ్యతో కలిసి రానా సీఎం చంద్రబాబుని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ భేటీ సందర్భంగా.. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నామని చంద్రబాబు అన్నారు. ఇక, రీల్ చంద్రబాబు కూడా అమరావతి అభివృద్దిపై ఆసక్తికరమైన కామెంట్ చేశారు. అమరావతి ఎంతో ఆకట్టుకునేలా ఉంది. సినిమా పరిశ్రమ ఏపీలో అభివృద్ధి చెందేందుకు అమరావతి ఉపయోగపడుతుందని రానా అన్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ స్టార్స్ తో నిండిపోయింది. కైకాల సత్యనారాయణ మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, జిష్ణు, సచిన్ కేడ్కర్ రానా దగ్గుపాటి.. తదితరులు కీలక పాత్రలో నటించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్… లు కనిపించబోతున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.