డీఎంకే అధినేత క‌రుణానిధి క‌న్నుమూత‌

గ‌త కొద్దిరోజులుగా అనారోగ్యంతో త‌మిళ‌నాడులోని కావేరీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత క‌రుణానిధి క‌న్నుమూశారు. ఇప్పిటికే రెండుసార్లు ఆయ‌న ఆరోగ్యం మ‌రింత విష‌మించిన‌ట్లు ప్ర‌క‌టించిన వైద్యులు, సాయంత్రం 6.10నిమిషాల‌కు ఆయ‌న తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. దీంతో పెద్ద సంఖ్య‌లో క‌రుణానిధి అభిమానులు, రాజ‌కీయ నేత‌లు, సినీ న‌టులు ఆసుప్ర‌తికి చేరుకుంటున్నాయి.

ఐదుసార్లు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా, 13సార్లు శాస‌నస‌భ్యునిగా ఎన్నికైన ఘ‌న‌త కరుణానిధి సొంతం. యాభైఏళ్లు డీఎంకే అధినేతగా కొన‌సాగిన ఆయ‌న 94ఏళ్ల వ‌య‌సులో తుదిశ్వాస విడిచారు. త‌మిళ‌భాషాభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ చేప‌ట్టిన హిందీ వ్య‌తిరేక ఉద్య‌మం త‌మిళ ప్ర‌జ‌ల‌కు క‌రుణానిధిని మ‌రింత ద‌గ్గ‌ర‌చేసింది. కవి, స్క్రిప్ట్ రైటర్, ఉపన్యాసకుడు, గాయకుడు కూడా. ఆయనకు స్టాలిన్, ఎంకె అల‌గిరి, ముత్తు, త‌మిళ‌ర‌సు అనే నలుగురు కుమారులు , ఇద్దరు కుమార్తెలు క‌నిమొళి, సెల్వి ఉన్నారు.

కరుణానిధి 1957లో తొలిసారిగా ఇండిపెండెంట్ సభ్యుడిగా తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన ఓటిమి ఎరుగని నేతగా గెలుస్తూ వచ్చారు. 82వ ఏట 2006లో ఆయన ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయాల్లో పరాజయం అన్నది ఆయనకు తెలియదు. ఆయ‌న మృతితో త‌మిళ‌నాడు శోక సంద్రంలో మునిగిపోయింది. దేశ వ్యాప్తంగా రాజ‌కీయ నాయ‌కులు క‌రుణానిధి మృతికి సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.