కరుణానిధి సినీ జీవితం.. ఇలా మొదలైంది !
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి గానే కాదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్టార్ రచయిత. తమిళ సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసిన వ్యక్తి కరుణానిధి. 1942లో ‘మురసోలి’ అనే పత్రికను కూడా నడిపారు. కరుణానిధి తన 14వ ఏటనే నాటకాలు, కవిత్వం రాయడం ప్రారంభించారు. ద్రావిడ నడిగర్ కళగం లో నాటక రచయితగా జీవితాన్ని ప్రారంభించారు. ఈరోడ్‌లోని పెరియార్ మ్యాగజైన్ ‘కుడియరసు’లో కరుణానిధి అసిస్టెంట్ ఎడిటర్‌గా చేశారు. ప్రసిద్ధి చెందిన చలనచిత్ర నిర్మాణ సంస్థ ‘జుపిటర్ పిక్చర్స్’ నుంచి పిలుపు రావడంతో అందులో స్క్రిప్ట్ రైటర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
1947లో తొలిసారి ‘రాజకుమారి’ అనే చిత్రానికి సంభాషణలు రాశారు. తర్వాత ‘అభిమన్యు’కు మాటలు రాసిన కరుణానిధి.. 1952లో వచ్చిన ‘పరాశక్తి’ సినిమాతో సంభాషణలు రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, నటుడు శివాజీ గణేశన్‌కు ఈ చిత్రం పాపులారిటీని తెచ్చింది. ఆ తర్వాత ‘మనోహర’తో కరుణానిధి పేరు మార్మోగిపోయింది. అలా ‘మంత్రి కుమారి’, ‘పుదైయల్’, ‘పూంబుహార్’, ‘నేతిక్కుదండనై’, ‘చట్టం ఒరు విలయాట్టు’, ‘పాసం పరవైగల్’, ‘పొరుత్తుపొదుం’ తదితర చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఆయన చివరిగా 2011లో త్యాగరాజన్ దర్శకత్వంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించిన ‘పొన్నార్ శంకర్’ చిత్రానికి కథ అందించారు. ఇలా ఆయన కెరీర్‌లో మొత్తం 39 సినిమాలకు స్క్రిప్ట్‌ను అందించారు.