మెరీనా బీచ్’లో కరుణకు చోటు లేదట !

తమిళనాడు విషాదంలో మునిగిపోయింది. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్న కరుణానిధి చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. అన్నాదురై సమాధి వద్దే కరుణానిధి సమాధి ఏర్పాటు చేయాలని డీఎంకే శ్రేణుల అభిమతం. దీనిపై ఇప్పటికే కరుణానిధి కుటుంబ సభ్యులు, డీఎంకే నేతలు తమిళనాడు ప్రభుత్వం అనుమతి కోరారు. అందుకు ప్రభుత్వం నిరాకరించింది.

అన్నాదురై సమాధి పక్కనే కరుణానిధి సమాధి ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మరణించిన వారికే మెరీనా బీచ్ లో స్థానం ఉంది. ఐతే, కరుణానిధి సమాధి కోసం గిండి ప్రాంతంలో రెండు ఎకరాలు కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విచారణ చేపట్టనున్నారు.

అన్నాదురై కరుణానిధి రాజకీయ గురువు. ఈవీ రామస్వామి పెరియార్‌, అన్నాదురైతో కలిసి కరుణానిధి ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈవీ రామస్వామి, అన్నాదురైతో పాటు కరుణానిధి కూడా ‘ద్రవిడ కళగం’ పార్టీలో ముఖ్యపాత్ర పోషించారు. ఆ తర్వాత రామస్వామి పెరియార్‌తో విభేదాలు రావడంతో అన్నాదురై, కరుణానిధి కలిసి ‘ద్రవిడ మున్నెట్ర కళగం’ పార్టీని స్థాపించారు. 1967లో తొలి సారిగా తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చింది. అన్నాదురై సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1969లో కన్నుమూయడంతో కరుణానిధి పార్టీ పగ్గాలు అందుకున్నారు. అప్పటి నుంచి దాదాపు ఐదు దశాబ్దాల పాటు కరుణానిధి డీఎంకే అధ్యక్షుడిగా ఉన్నారు.