దమ్ముంటే అడ్డుకోండి.. !!
టిఆర్ఎస్ కు ఎవరితో సంబందాలు ఉన్నాయో ముసుగు తొలిగిపోయిందని టీకాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎంపీలు ఎన్డీయే అభ్యర్థికి ఓటు వేసి మోడీకి మద్దతు తెలిపారని ఆయన చెప్పారు. రేపు జరగబోయే ఎన్నికల్లో మోడీ తో కలిసి పనిచేస్తారనే సంకేతాలు ఇచ్చారని, మైనారిటీ రిజర్వేషన్ కు సహకరించని మోడీకి ఎందుకు మద్దతు ఇచ్చారో చెప్పాలని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మైనారిటీ ప్రజలు ఆలోచించాలని రేవంత్ అన్నారు.
మోడీకి కేసీఆర్ కు మధ్య సంధాన కర్తగా ఆదాని వ్యవహరిస్తున్నారని, కరుణానిధి మరణించినప్పుడు ఆదాని సొంత విమానంలోనే కేసీఆర్ చెన్నై వెళ్లారని రేవంత్ ఆరోపించారు. మార్వా కంపెనీ విద్యుత్ ను తెలంగాణ కొనుగోలు చేయకపోతే ఆదాని కంపెనీ దివాలా తీస్తుంది కాబట్టే, ఆదాని కంపెనీని గట్టెక్కించ డానికే ఎక్కువ ధరకు కేసీఆర్ ఛత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని అన్నారు రేవంత్. అందుకే ఆదాని కేసీఆర్ ను ప్రసన్నం చేసుకుంటున్నాడని చెప్పారు.
సొంత ప్రయోజనాల కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను బలిస్తున్నాడని, కేసీఆర్ బీజేపీ కి మద్దతు ఇస్తుంటే ఎంఐఎం టిఆర్ఎస్ కు ఎందుకు మద్దతు ఇస్తుందో ఆలోచించాలని అన్నారు రేవంత్. రెండు పార్టీలు కలిసి మైనారిటీలను మోసం చేస్తున్నాయన్నారు. తన పిల్లలను ఏసీ గదుల్లో పెట్టి పేద పిల్లలను రోడ్డు న పెట్టడం కేసీఆర్ కు అలవాటని ఎద్దేవా చేశారు. దమ్ముంటే హరీష్ రావు, కేటీఆర్ వచ్చి రాహుల్ ను అడ్డుకోవాలని, మిమ్మల్ని తొక్కి పడేసి ఓయూ పర్యటన చేయడం ఖాయమంటూ హెచ్చరించారు రేవంత్.