సైకిల్ కాంగ్రెస్’తో..! కారు కమలంతో..!?
ఇటు తెలంగాణలోనూ, అటు ఏపీలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలలో పొత్తులపై లెక్కలు వేసుకుంటున్నారు. మొదట్లో ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ , థర్డ్ ఫ్రంట్ అని చంద్రబాబు నాయుడు అన్నప్పటికీ పార్టీల వ్యవహారం మాత్రం ఆ దిశగా కనిపించడంలేదనేది విశ్లేషకుల వాదన. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు వ్యవహారశైలి గమనిస్తే వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ఒక సంకేతాన్ని ఇచ్చినట్లుగా భావించవచ్చు.
ఫెడరల్ ఫ్రంట్ అంటూ గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ కేంద్రంపై అవిశ్వాసం సమయంలో ఓటింగ్ కు దూరంగా ఉండి తటస్థంగా వ్యవహరించింది. తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేయడం బీజేపీకి టీఆర్ఎస్ దగ్గరవుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు టీడీపీ ఈ ఎన్నికలో టీడీపీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలపడం టీడీపీ హస్తం పార్టీకి దగ్గరవుతుందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో , టీఆర్ఎస్ బీజేపీతో పొత్తు కుదుర్చుకుంటుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడింది. గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పరిస్థితులనుబట్టి వ్యవహరించాలని ఆ పార్టీలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందే బాహాటంగా పొత్తులకు వెళ్లకపోయినా, అంతర్గత పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల తరువాత అవసరమైతే పొత్తు కుదుర్చుకోవచ్చనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి ఎవరు ఎవరికి దగ్గరవుతారో, ఎవరితో పొత్తులు కుదుర్చుకుంటారో..