మహేష్ మరోసారి తగ్గాల్సిందే.. !!

తగ్గినోడు ఎప్పుడు ఓడినట్టు కాదు. ఈ విషయం సూపర్ స్టార్ మహేష్ బాబుకు బాగా తెలుసు. అందుకే ‘బాహుబలి’ వస్తుందంటే తగ్గాడు. ‘శ్రీమంతుడి’ని వాయిదా వేసుకొన్నాడు. రాజమౌళి చేసిన ప్రయత్నానికి గౌరవం ఇచ్చారు. ఫలితంగా 10జులై 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘బాహుబలి’ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత నెల గ్యాప్ తో 7ఆగస్టు 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేష్ ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. నాన్ బాహుబలి రికార్డులని బద్దలు కొట్టింది.

తాజాగా, మహేష్25 ‘మహర్షి’ విషయంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మహర్షి’ సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 05న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఐతే, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మెగాస్టార్ చిరంజీవి 151 ‘సైరా నర్సింహారెడ్డి’ వచ్చే యేడాది ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ మరోసారి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

అప్పుడు రాజమౌళి కోసం వెనక్కి వెళ్లిన మహేష్.. ఈసారి రామ్ చరణ్ కోసం ఆ పని చేయాల్సి వస్తుంది. మహేష్-రామ్ చరణ్ మంచి మిత్రులు. ఇటీవల కాలంలో రామ్ చరణ్-మహేష్-తారక్ లు కలిసి ఒకట్రెండు వేదికలపై సందడి చేశారు. అది వారి అభిమానులకు బాగా నచ్చింది. రామ్ చరణ్ అడిగితే మహేష్ కాదనలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సైరా కోసం మహర్షి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్ నగర్ సమాచారమ్.