సెప్టెంబ‌రుకు ముందే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన మంత్రి కేటీఆర్..!?

ముఖ్య‌మంత్రి కేసీఆర్ సెప్టెంబ‌రులో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామంటూ టీఆర్ఎస్ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే సెప్టెంబ‌రుకు ముందే మంత్రి కేటీఆర్ ఓ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేశారు. ఆ ప్ర‌క‌ట‌న ప‌రోక్షంగానే అయినా ఆయ‌న నోటినుంచి ఆ మాట వ‌చ్చిందంటే ఆ టిక్కెట్టు ఖాయమ‌నే అభిప్రాయానికి వ‌చ్చేశారు పార్టీ నేత‌లు.
కరీంనగర్ టూ వేములవాడ నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన అనంత‌రం ఆయ‌న స‌భ‌లో మాట్లాడారు. రాష్ట్రానికి కొత్త బుచ్చగాళ్ళు వచ్చారని, సంక్రాంతి కి గంగిరెద్దుల వాళ్ళు వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు వచ్చారంటూ ఎద్దేవా చేశారు.

గంగిరిద్దుల వాళ్ళు మంచి వాళ్లేన‌ని, కాంగ్రెస్ వాళ్లే లుచ్చాగాళ్ళు అంటూ విమ‌ర్శించారు. నాలుగేళ్లు రాని వాళ్ళు ఇప్పుడు ఓట్ల కోసం మళ్ళీ రాష్ట్రానికి వచ్చారని, తన సొంత నియోజకవర్గం లోని మున్సిపాలిటీ ని కూడా గెలిపించలేకపోయిన రాహుల్ ఇక్కడెం చేస్తాడని విమ‌ర్శించారు. రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రేస్ నాశనమౌతోంద‌ని, తెలంగాణ లో కూడా అదే గతి ప‌డుతుంద‌న్నారు. ఓ వైపు కాంగ్రెస్ ను విమ‌ర్శిస్తూనే మ‌రోవైపు స్థానిక ఎమ్మెల్యేను ప్ర‌శంసించారు. క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను త‌నకంటే ఎక్కువ మెజారిటీ తో గెలిపించాలంటూ కేటీఆర్ కోరారు. దీంతో కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అని చెప్పకనే చెప్పిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.