సల్మాన్’కి క్రెడిట్ ఇవ్వడం లేదు


తెలుగు బుల్లితెరపై నాగిని, నాగిని 2 సూపర్ హిట్ సీరియల్స్ గా నిలిచాయి. ఇందులో నాగినిగా కనిపించిన మౌనీరాయ్‌ బుల్లితెర సూపర్ స్టార్ గా ఎదిగింది. ఆమె దాదాపు పదేళ్ల నుంచి బుల్లితెరపై కొనసాగుతోంది. ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ‘గోల్డ్‌’ సినిమాతో ఈ బెంగాలీ భామ తెరంగేట్రం చేయనుంది. స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా గోల్డ్ ఈరోజే (ఆగస్టు15) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, ఈ సినిమా విడుదల కాకముందే మౌనీరాయ్‌ ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

ఐతే, ఈ ఆఫర్ల వెనక స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఉన్నట్టు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం పై మౌనీరాయ్‌ స్పందించింది. ‘ఆఫర్‌ వెనుక ఉన్నది ఎవరంటూ నన్ను అడుగుతున్నారు. ఈ ప్రశ్న నన్నడిగే కంటే నా ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లను అడిగితే బాగుంటుంది. పదేళ్ల పాటు బుల్లితెరపై వివిధ క్యారెక్టర్లతో నన్ను నేను నిరూపించుకున్నాను. ఆ తర్వాత వెండితెరపై నటించే అవకాశం వచ్చింది. గోల్డ్‌ సినిమాలో బెంగాలీ గృహిణిగా కన్పించబోతున్నాను. జన్మతః బెంగాలీ అయిన నాకు ఆ పాత్ర దక్కించుకోవడం ఏమంత పెద్ద విషయం’ కాదని చెప్పుకొచ్చింది.

సల్మాన్‌ ఖాన్‌ అంటే నాకెంతో అభిమానం. కేవలం ఈ కారణంగానే నాకు అవకాశాలు వస్తున్నాయంటూ వార్తలు ప్రచారం చేయడం సరికాదు అంటోంది. మౌనీరాయ్‌ తీరుని చూస్తుంటే సల్మాన్ ఖాన్ కి ఏమాత్రం క్రెడిట్ ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఐతే, సల్మాన్ ఖాన్ తో ఈ బ్యూటీ కాసింత ఫేమస్సే అయ్యిందని చెప్పాలి. పలుమార్లు సల్మాన్ తో ఫోటోలు. బుల్లితెరపై ఒకట్రెండు షోలలో సల్మాన్ తో రొమాంటిక్ డ్యాన్సులు ఆమెకు బాగానే పేరు తెచ్చిపెట్టాయి.