మేమూ సెప్టెంబరులోనే..!
తెలంగాణ సమాజంలో రాహుల్ కు ఉన్న విశ్వసనీయత ఎవరికీ లేదని, తెలంగాణ ప్రజల గుండెల్లో గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. మహిళీ సంఘాల సమావేశం కేసీఆర్ గుండెల్లో దడ పుట్టించిందని ఆయన చెప్పారు. అందుకే 24 గంటలు గడవకముందే 970 కోట్ల మహిళా సంఘాల బకాలయిలు విడుదల చేశారని తెలిపారు ఉత్తమ్. ఆంధ్రా, రాయలసీమ ప్రజలకు రాముల్ భరోసా ఇచ్చారని, రెండు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలు అమలు చేస్తామని చెప్పారని అన్నారు. 31656 బూత్ కమిటీ అధ్యక్షులతో మరోసారి రాహుల్ టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడతారన్నారు.
సరూర్ నగర్ సభ ఊహించిన దానికంటే సక్సెస్ అయిందని, రాహుల్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుందన్నారు ఉత్తమ్. వృద్ధాప్య పెన్షన్ వయోపరిమితిని 58ఏళ్లకు తగ్గిస్తామని, వికలాంగులకు పెన్షన్ మూడు వేలకు పెంచుతామన్నారు. రాష్ట్రంలోని పది లక్షల యువకులకు మూడువేల రూపాయల నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పారాయన. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. సెప్టెంబరులో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో.. తాము కూడా సెప్టెంబరులోనే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు ఉత్తమ్. కేటీఆర్ చిన్నపిల్లోడని, అతను చిల్లరగా మాట్లాడుతున్నాడని, తాము పట్టించుకోమని చురకలు వేశారు ఉత్తమ్.