రాహుల్ అలా ఎందుకన్నారో …!
టీఆర్ఎస్ వ్యూహానికి కాంగ్రెస్ ప్రతి వ్యూహంతో ముందుకెళుతోంది. ఇప్పటికే సెప్టెంబరులో టీఆర్ తోపాటు కాంగ్రెస్ కూడా అభ్యర్ధులను ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ ఎలా ముందుకెళ్లాలనుకుంటుందో వివరించారు. సెప్టెంబర్ లో అభ్యర్థుల ప్రకటన కోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర కాంగ్రెస్ కార్యక్రమాలపై రాహుల్ చాలా సంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. స్వయంగా రాహుల్ ఈ విషయాన్ని తనతో చెప్పారన్నారు.
బస్సు యాత్రను మరో రెండు మూడు రోజుల్లో తిరిగి ప్రారంభిస్తామని, సెప్టెంబర్ లో రాహుల్ మరోసారి రాష్ట్రానికి వస్తారని ఉత్తమ్ తెలిపారు. ఆ సమయంలో రాహుల్ బస్సు యాత్రలో కూడా పాల్గొంటారని చెప్పారు. టిఆర్ఎస్ సభ కంటే భారీ సభను తామూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాము ప్రకటిస్తున్న ఎన్నికల హామీలన్నీ పూర్తిస్థాయి అధ్యయనం తరువాతే ప్రకటిస్తున్నామన్నారు. రెండులక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి అసాధ్యమేమీ కాదని, నిరుద్యోగ భృతి కోసం నెలకు 300 కోట్లు కేటాయించడం కష్టమేమీ కాదన్నారు. పార్టీలోకి ప్యారాచూట్ ద్వారా దిగుమతి అయిన వాళ్లకు టికెట్స్ కట్ చేస్తానని రాహుల్ ఎందుకు అన్నారో తనకు తెలియదని ఉత్తమ్ తెలిపారు.