రివ్యూ : గోల్డ్

చిత్రం : గోల్డ్ (2018)

నటీనటులు : అక్షయ్ కుమార్, మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్ సాధ్.. తదితరులు

సంగీతం: సచిన్-జిగర్

దర్శకత్వం : రీమ కగ్టి

నిర్మాణం : రితేష్ సిధ్వానీ, పర్హాన్ అక్తర్

విడుదల తేదీ : ఆగస్టు 15, 2018.

రేటింగ్ : 4.5/5

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ దేశానికి గోల్డ్ తీసుకొచ్చారు. ఆయన తాజా చిత్రం ‘గోల్డ్’. దర్శకురాలు రీమా కగ్టి స్వయంగా కథని రాసుకొని దర్శకత్వం వహించిన చిత్రమిది. దాదాపు 200యేళ్లు ఇండియాను పాలించిన బ్రిటిషర్ల మీద 1948 ఒలంపిక్స్‌లో భారత హాకీ జట్టు గెలుపుతో ప్రతీకారం తీర్చుకున్న సందర్భానికి దేశభక్తిని జోడించి తెరకెక్కించిన చిత్రమిది. ఆనాటి బ్రిటిష్ ఇండియా హాకీ జట్టు కోచ్ తపన్ దాస్ పాత్రని అక్షయ్ కుమార్ పోషించారు.
స్వాత్రంత్య్ర దినోత్సవం కానుకగా ‘గోల్డ్’ బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కథ :

తపన్ దాస్ (అక్షయ్ కుమార్) బ్రిటిష్ ఇండియా హాకీ జట్టు కోచ్. బ్రిటిషర్ల హయాంలో పని చేస్తున్నా.. అపారమైన దేశభక్తి ఉన్న బెంగాళీ బాబు. స్వాతంత్య్రం అనంతరం దేశానికి గోల్డ్ మెడల్ సాధించి పెట్టాలన్నది తపన్ దాస్ లక్ష్యం. ఇందుకోసం 1948లో లండన్ కేంద్రంగా జరిగే ఒలంపిక్స్‌ ని టార్గెట్ గా పెట్టుకొంటాడు. మెరికల్లాంటి ఆటగాళ్లతో జట్టుని రెడీ చేసుకొంటాడు. ఈ జట్టుకు లాహోర్‌కు చెందిన ఇంతియాజ్ షా కెప్టెన్. ఐతే, దేశ విభజన తర్వాత తపన్ దాస్ తయారు చేసిన జట్టు ముక్కలవుతుంది.

అప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత బలమైన భారతజట్టు చీలి పోవడంతో.. ఈ సారి ఒలంపిక్స్‌లో హాకీ గోల్డ్ తమదే అనే గర్వంతో బ్రిటిషర్లు ఉంటారు. ఆ గర్వాన్ని తపన్ దాస్ ఎలా దించాడు. భారత జట్టు ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం కోసం తపన్ దాస్ పడిన తపన ఏంటన్న కథాంశంతో ‘గోల్డ్’ తెరకెక్కింది.

ఎలా ఉందంటే ?

దేశభక్తి నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయ్. ఐతే, అక్షయ్ కుమార్ ‘గోల్డ్’లో ఓ స్పెషల్ ఉంది. ఇందులో భారత్ ప్రత్యర్థి పాకిస్థాన్ కాదు. పాకిస్థాన్ కూడా భారత్ లో భాగమే. అప్పుడే భారత్ నుంచి విడిపోయిన ఓ భాగం పాకిస్థాన్. భారత్, పాక్ ఇద్దరి ప్రత్యర్థి బ్రిటీష్ జట్టునే. ఫైనల్ లో బ్రిటీష్ జట్టుపై భారత్ గెలవాలని సపోర్టు చేసిన పాక్ జట్టు అది. ఆనాటి పరిస్థితుల్లో ఒలంపిక్స్ లో భారత్ జట్టుకు గోల్డ్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కోచ్ తపన్ దాస్ కథని అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకురాలు రీమా కగ్టి.

దేశ విభజన తర్వాత ఒకే జట్టులోని ఆటగాళ్లు.. కొందరు పాకిస్థాన్, హిందూస్థాన్ తరుపున ఆడాల్సిన పరిస్థితుల్లో ఆటగాళ్లు పడే ఆవేదనను అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్‌లో భారత హాకి జట్టు గెలుపు అనంతరం థియేటర్స్ ఒక్కరు సీట్లలో కూర్చొని లేరు. అందరు నిలబడి ఇప్పుడు భారత హాకి జట్టు గోల్డ్ తీసుకొచ్చినట్టు చప్పట్లతో అభినందిస్తున్నారు. ఇదొక్కటి చాలు రీమా కగ్టి సినిమాని ఎంత అద్భుతంగా తీసిందో చెప్పడానికి.

ఎవరెలా చేశారంటే ?

ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ముందుండే నటుడు అక్షయ్ కుమార్. ఎయిర్ లిఫ్ట్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ సినిమాల్లో ఆయన నటన అద్భుతం. ‘గోల్డ్’ కోసం ఆయన పడిన తపన అంతా ఇంతా కాదు. ఇంకా స్వాత్రంత్య్రం కూడా రాకముందే.. వచ్చిన తర్వాత నా దేశానికి బంగారు పతకాన్ని తీసుకురావాలనే దేశభక్తి కలిగిన కోచ్. పటిష్టమైన జట్టు దేశ విభజన కారణంగా విడిపోతే.. మళ్లీ మెరికాల్లాంటి ఆటగాళ్లని తయారు చేసుకొని… రంగంలోకి దిగిన కోచ్ పాత్రలో అక్షయ్ అదరగొట్టాడు.

తెరపై అక్షయ్ కుమార్ కనబడలేదు. దేహాం నిండా దేశభక్తి కలిగిన తపన్ దాస్ మాత్రమే కనిపించాడు. వ్యక్తిగత జీవితంలోని సన్నివేశాల్లోనూ అక్షయ్ నటన చాలా బాగుంది. ఆయన భార్యగా పాత్రలో మౌనీ రాయ్ నటించింది. అక్షయ్-మౌనీరాయ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హాకీ ప్లేయర్స్ పాత్రల్లో అమిత్ సాధ్, వినీత్ కుమార్ సింగ్, సన్నీ కౌశల్, కునాల్ కపూర్ తదితరులు ఆకట్టుకున్నారు.

సాంకేతికంగా :

సచిన్ జిగర్ అందించి సంగీతం బాగుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మాయ చేశాడు. అల్వరో గుతీర్రెజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగుంది. ఎక్కడ సాగదీత కనిపించలేదు. ప్రేక్షకుడు కథతో ప్రయాణించేలా స్క్రీన్ ప్లే సాగింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బాటమ్ లైన్ : గోల్డ్.. కంటే ఎక్కువే !

రేటింగ్ : 4.5/5