వాజ్ పెయి ఇంటి వద్ద ఆ ఏర్పాట్లకు అర్థమేంటి..?
మాజీ ప్రధాని వాజ్ పెయి ఆరోగ్యం మరింత క్షీణించిందని ఢిల్లీ ఎయిమ్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయన శరీరం వైద్యం చేసేందుకు కూడా సహకరించలేని స్థితిలో ఉందని ఇప్పటికే వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు , బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లి ప్రత్యక్షంగా కాసేపు ఉండి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
ఇప్పటికే త్రిపుర గవర్నర్ వాజ్ పేయి మరణించారంటూ ట్వీట్ చేసి, తొలగించి క్షమాపణలు చెప్పారు. అయితే మాజీ ప్రధాని వాజ్ పెయి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం అందరిలోనూ ఇంకా ఆందోళన తొలగలేదు. ఈ నేపథ్యంలో వాజ్ పెయి ఇంటి వద్ద స్టేజ్, సెక్యూరిటీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది కేంద్రప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వాజ్ పెయి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోననే టెన్షన్ అందరిలో నెలకొంది.