మెగాస్టార్ బర్త్ డే గిఫ్ట్.. ఓ రోజు ముందుగానే !

దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ముందస్తు హాట్ టాపిక్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు ప్రకటించేశారు కూడా. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీకి అదే ఆలోచన చేస్తున్నట్టు విశ్లేషిస్తున్నారు. ఐతే, మెగాస్టార్ చిరంజీవి కూడా ముందస్తుకు వెళ్లాడు. అభిమానులకు ఓ రోజు ముందుగానే బర్త్ డే గిఫ్ట్ ని అందించబోతున్నారు మెగాస్టార్.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘సైరా’కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ గానీ, టీజర్‌గానీ వచ్చే అవకాశాలున్నాయని అభిమానులు ముందే ఊహించారు. దానికి తగ్గట్టుగానే చిరు పుట్టిన రోజు కానుకగా ‘సైరా’ టీజర్‌ని విడుదల చేయబోతోంది చిత్రబృందం. ఐతే, ఈ కానుక ఒకరోజు ముందే అంటే ఆగస్టు 21నే అందివ్వబోతున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల 21 (మంగళవారం) ఉదయం 11.30 గంటలకు సైరా టీజర్ ని విడుదల చేయబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ఇది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ నిర్మాత. అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, సుదీప్‌, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ షూటింగ్ జరుగుతోంది. 2019 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.