అబ్బే.. ఆయన సాయం చేసినా టీడీపీ తప్పుబడుతోందట..!!
ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంఘమిత్రలకు డబ్బులు పంపిణీ చేయడంపై అధికార టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఎమ్మెల్యే భార్య అకౌంట్ నుంచి సంఘమిత్రలకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను వారి వారి అకౌంట్ లోకి బదిలీ చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చెవిరెడ్డికి డబ్బులు ఎక్కువ ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగించాలి కానీ, ఇలా వ్యక్తిగతంగా డబ్బులివ్వడమేంటని ప్రశ్నించారు. దీంతో వివాదం పెద్దదయింది. దీనిపై చెవిరెడ్డి స్పందిస్తూ తన చర్యలను సమర్థించుకున్నారు.
రాష్ట్రంలో వేతనాలు లేకుండా ఏళ్ల తరబడి పనిచేస్తున్న సంఘమిత్రలకు తెలుగుదేశం నాయకులు చేతనైతే సాయం చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హితవు పలికారు. సంఘమిత్రలకు నెలకు రూ.10 వేలు ఇస్తామని జగన్ ప్రకటించడంతో తమ నియోజకవర్గంలో ఉన్న పలువురు సంఘమిత్రలు తనను కలసి హర్షం ప్రకటించారని తెలిపారు. వారి బాధలను విన్న తాను 175 మంది సంఘమిత్రల బ్యాంకు ఖాతాలకు రూ.2 వేల చొప్పున రూ.3.50 లక్షల సొమ్మును తన భార్య ఖాతా నుంచి ఈనెల 3న బదిలీ చేశామన్నారు. కష్టాల్లో ఉన్న వారికి మా వంతు సాయంగా డబ్బివ్వడాన్ని టీడీపీ తప్పుపట్టడం దారుణమన్నారు.