తోడళ్లుల్లు.. రిలాక్స్ కోసం బ్యాంకాక్ !

తోడళ్లుల్లు వెంకటేష్, వరుణ్ తేజులు బ్యాంకాక్ వెళ్తున్నారు. అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో వెంకీ-వరుణ్’ల మల్టీస్టారర్ గా ‘ఎఫ్2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తొలి షెడ్యూల్ లో హైదరాబాద్ లో పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్ కోసం చిత్రబృంద బ్యాంకాక్ వెళ్లనుంది. అక్కడ 20రోజుల పాటు షూటింగ్ జరపనున్నారు. ఓ సాంగ్ కూడా చిత్రీకరించనున్నట్టు సమాచారమ్.

ఇందులో వెంకీ, వరుణ్ లు తోడళ్లుగా కనిపించబోతున్నారు. వెంకీ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహ్రీన్ జతకట్టనున్నారు. ఇంట్లో ఆడవాళ్ల టార్చర్ తట్టుకోలేని తోడళ్లుల్లు ఫారిన్ ట్రిప్ కి వెళ్తారట. అక్కడ రిలాక్స్ అవుదామని ప్లాన్ చేసుకొంటే.. సప్రైజ్ గా వీరి వైఫ్ లు అక్కడికి రావడం.. ఆ తర్వాత వినోదాత్మక సన్నివేశాలతో సినిమా సాగుతుందని సమాచారమ్.

ఈ సినిమాతో పాటు వెంకీ నాగ చైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు. దీనికి ‘వెంకీ మామ’ టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలిసిందే. ఇక, వరుణ్ తేజ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘అంతరిక్షం’ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో లావణ్య త్రిపాఠి, అతిది రావు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.